ప్రస్తుతం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, సెయిల్‌లు కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బదులుగా శాశ్వత పరిష్కారం కోసం ఈ రెండింటినీ విలీనం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు వెల్లడించారు. అలాగే రుణాల నుంచి బయటపడేందుకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చెందిన 1500 నుంచి 2000 ఎకరాల భూములను ఎన్‌ఎండీసీకి విక్రయించే ప్రతిపాదనలు, బ్యాంకు రుణాల వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని గతంలో నిర్ణయించగా.. దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణ బదులుగా విలీనం ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తిని పెంచేందుకు రూ.2500 కోట్లు నిధులు కేటాయించాలని కేంద్రం ఇటీవలే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముడిపదార్థాల కొరత కారణంగా స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి తగ్గింది. ముడిసరుకు కొరతతో స్టీల్ ప్లాంట్‌లోని రెండు ఫర్నేసులలో ఉత్పత్తి నిలిపేశారు. ఈ నేపథ్యంలో ఫర్నేసులను తిరిగి ప్రారంభించాలని కేంద్రం నిధులు కేటాయించింది. నవంబర్ నాటికి ఫర్నేసులలో ఉత్పత్తి ప్రారంభించాలని.. ముడిసరుకును సైతం సరఫరా చేస్తామని తెలిపింది. అలాగే కేటాయించిన నిధుల వినియోగం బాధ్యతలను ఎస్బీఐకు అప్పగించింది. ఇక ఉత్పత్తి తగ్గించిన నేపథ్యంలో కొంతమంది సిబ్బందిని కూడా ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలకు డిప్యుటేషన్ మీద పంపాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.