ఈ తొలి వందే భారత్ మెట్రో రైలు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి భుజ్ మధ్య ప్రయాణించనుంది. ఈ రైలు దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న మెట్రో రైళ్ల మాదిరిగానే ఉండగా.. వాటి కంటే సుదూర ప్రయాణాలకు ఉపయోగించనున్నారు. అహ్మదాబాద్-భుజ్ మధ్య 334 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5.45 గంటల్లోనే ఈ వందే భారత్ మెట్రో రైలు ప్రయాణించనుంది. భుజ్ రైల్వే స్టేషన్‌లో తెల్లవారుజామున 5.50 గంటలకు ప్రారంభం కానున్న ఈ వందే భారత్ మెట్రో రైలు.. ఉదయం 10.50 గంటలకు అహ్మదాబాద్ స్టేషన్‌కు చేరుకోనుంది. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు అహ్మదాబాద్‌లో ప్రారంభమై.. రాత్రి 11.10 గంటలకు భుజ్ చేరుకోనుంది. వారంలో 6 రోజులు ఈ వందే భారత్ మెట్రో రైలు ప్రయాణం చేయనుంది. ఇక భుజ్-అహ్మదాబాద్ మార్గంలో ఈ రైలుకు 9 స్టాప్‌లు ఉండగా.. ప్రతీ స్టేషన్‌లో 2 నిమిషాలు మాత్రమే ఆగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
వందే భారత్ రైలు లాగానే ఈ వందే భారత్ మెట్రో రైలు కూడా పూర్తిగా ఎయిర్ కండీషన్ కలిగి ఉంటుంది. మొదట 12 కోచ్‌లతో ప్రారంభం కానున్న ఈ వందే భారత్ మెట్రో రైలుకు.. ప్రయాణికుల రద్దీ దృష్టా వాటిని 16 కోచ్‌లకు పెంచనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఈ రైళ్లకు ప్రత్యేకమైన కోచ్ కాన్ఫిగరేషన్ ఉండనుండగా.. నాలుగు కోచ్‌లు ఒక యూనిట్‌గా ఉంటాయి. ఇందులో మన మెట్రో రైలు లాగా ఆటోమేటిక్ డోర్లు ఉండటం మరో ప్రత్యేకత. ఈ వందే భారత్ మెట్రో రైలును గంటకు 100 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టేలా రూపొందించారు.
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్.. ఇటీవలె కపుర్తలా రైల్ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించారు. అమృత్ భారత్ కోచ్‌లను ప్రారంభించిన కేంద్రమంత్రి.. ఆ సమయంలో వందే భారత్ మెట్రో రైలు తయారీ విధానాన్ని పరిశీలించారు.