దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వారాంతం నష్టాలు తప్పలేదు. అంతకుముందు సెషన్‌లో రికార్డు స్థాయిలో కొత్త గరిష్ఠాలకు చేరిన సూచీలు శుక్రవారం లాభాల స్వీకరణ కారణంగా బలహీనపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లేకపోవడంతో పాటు ఆసియా మార్కెట్లలో మిశ్రమ ర్యాలీ, దేశీయంగా మదుపర్లు అమ్మకాలకు దిగడంతో నష్టాలు ఎదురయ్యాయి. వీటితో పాటు గురువారం విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు స్వల్పంగా పెరగడం కూడా మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరల పెరుగుదల ఆర్‌బీఐ వడ్డీ రేట్ల నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చని, ఇది మార్కెట్ల ర్యాలీని బలహీనపరిచిందని విశ్లేషకులు తెలిపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 71.77 పాయింట్లు నష్టపోయి 82,890 వద్ద, నిఫ్టీ 32.40 పాయింట్లు కోల్పోయి 25,356 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, మీడియా రంగాలు 1 శాతానికి పైగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్, హిందూస్తాన్ యూనిలీవర్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.91 వద్ద ఉంది.