దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వరుస రికార్డులు నమోదవుతున్నాయి. అంతకుముందు సెషన్‌లలో భారీ లాభాలతో దూసుకెళ్లిన సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో స్థిరంగా రాణించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు కొనసాగుతున్నప్పటికీ రికార్డు గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్ల ర్యాలీ ఫ్లాట్‌గా జరిగింది. అయితే, కీలక రంగాలతో పాటు బ్లూచిప్ స్టాక్స్‌లో కొనుగోళ్ల ఉత్సాహంతో సెన్సెక్స్ కీలక 85 వేల మైలురాయిని దాటి 85,163 వద్ద కొత్త రికార్డు స్థాయిలను తాకింది. నిఫ్టీ సైతం చరిత్రలోనే తొలిసారిగా 26,000 మార్కును తాకింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 14.57 పాయింట్లు నష్టపోయి 84,914 వద్ద, నిఫ్టీ 1.35 పాయింట్లు లాభపడి 25,940 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్ రంగం దాదాపు 3 శాతం పుంజుకోగా, మిగిలిన ప్రధాన రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఈల్ టెక్, ఎంఅండ్ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాలను సాధించాయి. హిందూస్తాన్ యూనిలీవర్, ఆల్ట్రా సిమెంట్, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, నెస్లె ఇండియా స్టాక్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.64 వద్ద ఉంది.