దిశ, నేషనల్ బ్యూరో: ఉద్యోగుల నిరసనతో ఇటీవల విడుదల చేసిన ప్రకటన విషయంలో సెబీ (SEBI) వెనక్కి తగ్గింది. పని విధానంపై (work culture) కొందరు ఉద్యోగులు ప్రశ్నించారు. అయితే, బయటివ్యక్తుల ప్రోద్బలంతోనే ఉద్యోగులు వర్క్ కల్చర్ పైన గళమెత్తారని సెబీ పత్రికా ప్రకటన వెలువరించింది. దీనిపై ఉద్యోగులు మరోసారి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆ ప్రకటనపై వెనక్కి తగ్గుతూ మరో ప్రకటన విడుదల చేసింది. ఇకపై ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను అంతర్గతంగానే పరిష్కరించుకుంటామని చెప్పింది. ఉద్యోగ ప్రతినిధులతో నిర్ణయాత్మక చర్చలు జరిపింది. సంస్థకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలు నిర్ణీత సమయంలో అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అత్యున్నత స్థాయి పాలనా ప్రమాణాలకు తగినట్లుగా సెబీని తీర్చిదిద్దిన ఘటన ఉద్యోగులదే అని ప్రశంసించింది. ఉద్యోగుల సమస్యలపై అంతర్గతంగా స్నేహపూర్వకంగా పరిష్కరించుకునేందుకు ఓ విధానం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
అసలేం జరిగిందంటే?
సెబీ చీఫ్ మాధభి పురీ బచ్ ని (Madhabi Puri Buch) వివాదాలు చుట్టుముట్టాయి. సెబీ చీఫ్‌గా మాధబి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంస్థ పనివిధానం పూర్తిగా నాశనమైందని ఆరోపిస్తూ కేంద్ర ఆర్థిక శాఖకు కొందరు ఉద్యోగులు సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అనామక ఈమెయిల్ లో ఈ విషయాలు బయటపడ్డాయి. దీనికి సంబంధించిన వార్తలు మీడియాలో రావడంతో సెబీ సెప్టెంబర్ 4న ప్రెస్ రిలీజ్ చేసింది. బయటి వ్యక్తుల ప్రోద్బలంతోనే ఫిర్యాదు చేశారంటూ సెబీ అందులో పేర్కొంది. దీనిపై ఉద్యోగులు మండిపడ్డారు. ఆ తర్వాత రోజు నుంచి కార్యాలయం ఎదుట శాంతియుత నిరసనకు దిగారు. ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయగా.. సెబీ ఈ విధంగా దిద్దుబాటు చర్యలకు దిగింది.