దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా బ్యాంకులు అవసరమైన, ప్రయారిటీ రంగాలకు రుణాలు ఇవ్వాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ)కి చెందిన ఆర్థికవేత్తలు సూచించారు. దీనివల్ల బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడేందుకు సహాయపడుతుందని స్పష్టం చేశారు. 2006, మార్చి నుంచి 2023, మార్చి మధ్య బ్యాంకుల డేటాను అధ్యయనం చేసిన తర్వాత ఈ విషయం స్పష్టమైందని, ముఖ్యంగా స్థూల నిరర్ధక ఆస్తుల(ఎన్‌పీఏ) ఆధారంగానే బ్యాంకుల అసెట్ క్వాలిటీ మెరుగ్గా ఉందని ఆర్థికవేత్తలు వివరించారు. బ్యాంకుల మొత్తం రుణ పోర్ట్‌ఫోలియోలో ప్రయారిటీ రంగాల రుణ వాటా ఆస్తుల నాణ్యతపై ఆధారపడి ఉంటుందని గుర్తించినట్టు ఆర్‌బీఐ ఆర్థిక, విధాన పరిశోధనా విభాగానికి చెందిన శాంభవి ధింగ్రా, అర్పితా అగర్వాల్, స్నేహాల్ హెర్వాడ్కర్ ముగ్గురూ ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చారిత్రాత్మకంగా ప్రాధాన్యేతర రంగాల కంటే ప్రాధాన్యత రంగాలు ఎక్కువ ఎన్‌పీఏలను కలిగి ఉన్నాయి. అయితే, 2015 తర్వాత అసెట్ క్వాలిటీ రివ్యూ తర్వాత ట్రెండ్ రివర్స్ అయ్యిందని అధ్యయనం స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం బ్యాంకుల అసెట్ క్వాలిటీ మెరుగ్గా కొనసాగేందుకు ప్రాధాన్యత రంగాలకు రుణాలివ్వడం ముఖ్యమని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.