దిశ, బిజినెస్ బ్యూరో: నూనె గింజల ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రైతులను రక్షించేందుకు వంట నూనెల దిగుమతిపై సుంకాన్ని కేంద్రం తాజాగా పెంచింది. ఇటీవల విడుదలైన ఉత్తర్వుల ప్రకారం, ముడి పామాయిల్, సోయా బీన్, సన్‌ఫ్లవర్ నూనెపై దిగుమతి పన్నును 20 శాతం పెంచుతున్నట్లు పేర్కొంది. వీటిపై ఇప్పటి వరకు ఎలాంటి దిగుమతి సుంకం లేదు. అలాగే, రిఫైన్డ్ పామాయిల్, సన్‌ఫ్లవర్, సోయా బీన్ నూనెపై దిగుమతి సుంకాన్ని 12.5 శాతం నుంచి 32.5శాతానికి పెంచింది.
దిగుమతులపై సుంకాలు తక్కువగా ఉండటం కారణంగా దేశీయంగా వ్యాపారులు ఇతర దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో లోకల్‌గా ఉన్న రైతులకు నష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ చర్య వలన ఇతర దేశాల నుంచి దిగుమతులు తగ్గి దేశీయంగా రైతుల నుంచి కొనుగోలు చేయడానికి అవకాశం వస్తుంది. రైతులు భారీగా లాభపడే అవకాశం ఉందని ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. అలాగే, రైతులు సోయాబీన్, రాప్‌సీడ్ పంటలకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర పొందే అవకాశం ఉంది.
అయితే ఇదే సమయంలో వంట నూనెల ధరలు పెరిగే అవకాశం ఉంది. దీంతో సామాన్యుల నెత్తిన మరో భారం పడనుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశీయంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌తో పాటు తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు,ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నూనె గింజల సాగు ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్రలో జరగనున్న ప్రాంతీయ ఎన్నికలకు ముందు సోయాబీన్ సాగుదారులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.