దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో ప్రజల వైద్య ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. తమ సంపాదనలో ఎక్కువ భాగం మందులు, ఆస్పత్రి ఖర్చులకే వెచ్చించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి ఏటా ఈ భారం పెరుగుతూనే ఉంది. తాజాగా ఈ ఖర్చులపై ACKO ఇండియా హెల్త్ ఇన్సూరెన్స్ ఇండెక్స్ 2024 నివేదిక కీలక వివరాలను వెల్లడించింది. దేశంలో వైద్యం కోసం వెచ్చించే ఖర్చులు 14 శాతం వార్షిక రేటుతో పెరుగుతున్నాయని, ఆసుపత్రి ఖర్చులలో 23 శాతం రుణాల ద్వారా వస్తున్నాయని, దీంతో కుటుంబాలపై ఆర్థిక భారం పడుతుందని పేర్కొంది. అలాగే, ఈ ఖర్చుల్లో 62 శాతం తమ జేబుల్లో నుంచి చెల్లిస్తుండగా, ఊహించని అనారోగ్య పరిస్థితుల నుంచి ఆర్థికంగా బయటపడటానికి మెరుగైన హెల్త్ పాలసీ చాలా ముఖ్యమని నివేదిక హైలెట్ చేసింది.
దేశంలో కిడ్నీ వ్యాధికి అత్యధిక ఆరోగ్య బీమా క్లెయిమ్‌లతో ఢిల్లీ మొదటిస్థానంలో ఉండగా, తరువాత కొచ్చి ఉన్నట్లు నివేదిక గుర్తించింది. కిడ్నీ వ్యాధి క్లెయిమ్‌ల వాటా కొచ్చి, సికింద్రాబాద్, బెంగళూరు, జైపూర్‌లలో జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రోగుల సగటు వయస్సు 47 ఏళ్లు కాగా, కిడ్నీ సంబంధిత సమస్యల కోసం దాఖలు చేసిన అతిపెద్ద బిల్లు రూ.24,73,894కి చేరుకుందని నివేదిక తెలిపింది. అదే విధంగా గుండె జబ్బుల క్లెయిమ్‌లు కోల్‌కతా, ముంబయిలలో ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా 31-50 మధ్య వయస్సు గల వారిలో ఈ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని నివేదిక పేర్కొంది. ఇంకా, 2020 నుండి 2025 వరకు క్యాన్సర్ కేసులు 13 శాతం పెరుగుతాయని నివేదిక అంచనా వేసింది.