Paris Olympics 2024 | ఇంటర్నెట్‌డెస్క్: పారిస్ ఒలింపిక్స్ వేదికగా 124 ఏళ్ల రికార్డును తిరగరాస్తూ.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో పతకాలను సొంతం చేసుకొని భారత్‌కు మధుర విజయాన్ని అందించింది మను బాకర్ (Manu Bhaker). ఈ రోజు టీమ్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకం సొంతం చేసుకున్న తర్వాత.. తన ప్రదర్శన పట్ల ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంది. ఇలా రెండు రోజుల వ్యవధిలో రెండు పతకాలు సాధించిన మను ఒక దశలో షూటింగ్‌ను వదిలేద్దామనుకుందట. 2023 వరకు అదే ఆలోచనలో ఉందట.
‘‘ఆ రోజు నా జీవితంలో టర్నింగ్ పాయింట్. 2023లో ఒకరోజు కోచ్ నాతో మాట్లాడుతూ.. జీవితంలో ఏం చేద్దామనుకుంటున్నావని అడిగారు. వెంటనే తెలియదని సమాధానం ఇచ్చాను. ఒకట్రెండు సంవత్సరాల్లో షూటింగ్‌ను వదిలేసి పై చదువుల కోసం విదేశాలకు వెళ్లొచ్చు అని అన్నాను. దానికి కోచ్ నుంచి వచ్చిన స్పందన ఎంతగానో మోటివేట్ చేసింది’’ అని మను(Manu Bhaker) వెల్లడించారు. ‘‘నవ్వు ప్రపంచస్థాయి బెస్ట్ షూటర్‌వని నమ్ముతున్నాను. ఇక తర్వాత నీ ఇష్టం. నిర్ణయం నీదే’’ అని ఆ రోజు కోచ్ చెప్పిన మాటలు మనుపై బలమైన ప్రభావం చూపాయి. తొలి కాంస్యం గెలిచిన తర్వాత ఈ స్టార్ షూటర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన మాటలివి.
Manu Bhaker: మను బాకర్.. గురి తప్పని యంగ్ బుల్లెట్
‘‘మరి మీరు నా స్థానంలో ఉంటే ఏం చేస్తారు..?’’ అంటూ ఆమె వెంటనే కోచ్‌ను అడిగేసింది. అప్పుడు కోచ్ చెప్పిన మాటలు ఆమెలో మరింత కసిని పెంచాయి. ‘‘ఒలింపిక్స్ పతకమా, ఇంకోటా అని చూడకుండా, వెనక్కి తిరిగి చూడటం మానేసి.. నా కల నెరవేరేవరకు ఈ స్థానంలో ఉండేందుకు నిర్విరామంగా శ్రమిస్తాను’’ అని బదులిచ్చారట. ఇక పతక పోరులో మను అసలు స్కోర్ గురించి పట్టించుకోలేదు. అసలు ఆ స్క్రీన్ వైపే చూడలేదు. ‘‘వచ్చేది గోల్డ్ మెడలా లేకపోతే ఎలిమినేట్ అవుతానా..? ఏదైనా కానీ అంగీకరించాలి. నాకు వచ్చిన అవకాశం పట్ల కృతజ్ఞతతో ఉండాలి’’.. అంటూ ఆట ఆడుతున్నంతసేపు ఆలోచన ఇలాగే ఉందని చెప్పింది మను(Manu Bhaker).
చివరివరకు పోరాడదామని అనుకున్నాం: మను బాకర్
తాజాగా పతకం గెల్చిన తర్వాత మను బాకర్ (Manu Bhaker) మాట్లాడుతూ.. ‘‘చాలా ఆనందంగా ఉంది. ప్రత్యర్థుల ఆటతీరును నియంత్రించలేం. మన చేతిలో ఉన్నదాని వరకే చేయగలం. మనవంతు ప్రయత్నం చేద్దాం.. చివరివరకు పోరాడదామని నిర్ణయించుకొని సరబ్‌జోత్, నేను బరిలో నిలిచాం. మా ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది’’ అని వెల్లడించింది.
భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు 1900 ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో నార్మన్ ప్రిచర్డ్ రెండు రజత పతకాలు సాధించాడు. బ్రిటీష్-ఇండియన్ అథ్లెట్ అయిన ఇతడు 1900 ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ప్రిచర్డ్ తర్వాత ఏ భారత క్రీడాకారుడు కూడా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించలేదు. ఇప్పుడు ఆ ఘనతను మను(Manu Bhaker) సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్, బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు.. వరుస ఒలింపిక్స్‌లో రెండు పతకాలు దక్కించుకున్నారు.