Life Insurance: లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే పాలసీ గడువు ముగియక ముందే పాలసీని సరెండర్ చేసినప్పుడు ఇక నుంచి ఎక్కువ మొత్తంలో రీఫండ్ అందనుంది. అక్టోబర్ 1 నుంచే కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలకు హయ్యర్ స్పెషల్ సరెండర్ వాల్యూ ఆఫర్ చేయాలని ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI). ఈ కొత్త రూల్స్ అమలులోకి రావడం ద్వారా పాలసీదారులకు గ్రేటర్ ఫ్లెక్సిబులిటీ, లిక్విడిటీని కల్పిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఈ కొత్త నిబంధనల అమలును వాయిదా వేయాలంటూ ఎల్ఐసీతో పాటు ఇతర బీమా సంస్థలు ఐఆర్‌డీఏఐని కోరినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. కానీ, అందుకు సంబంధించి ఐఆర్‌డీఏఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అక్టోబర్ 1 నుంచే ఈ స్పెషల్ సరెండర్ వాల్యూ ఆఫర్ చేయాల్సి ఉంటుందని స్పష్టమవుతోంది.సంప్రదాయ బీమా పాలసీలైన ఎండోమెంట్, మనీబ్యాక్ పాలసీలే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఇందులో ఎక్కువ ప్రీమియంతో తక్కువ రక్షణ ఉంటుంది. చాలా మంది ప్రీమియం కట్టలేక మధ్యలోనే వదిలేస్తుంటారు. ఇలా టర్మ్ ముగియకముందే పాలసీని వెనక్కి ఇచ్చేస్తే బీమా సంస్థలు కొంత ఛార్జీలు వసూలు చేసి మిగిలిన సొమ్మును తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. తొలినాళ్లలోనే పాలసీని రద్దు చేస్తే ఏమీ తిరిగి ఇచ్చేవి కావు. ఈ విషయాన్ని గమనించిన ఐఆర్‌డీఏఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. గ్యారంటీడ్ సరెండర్ వాల్యూ, స్పెషల్ సరెండర్ వాల్యూ అని రెండు రకాలు ఉంటాయి. గ్యారంటీడ్ అంటే పాలసీ రద్దుతో బీమా సంస్థ చెల్లించాల్సిన మొత్తం ఉంటుంది. ఇందులో గడువు తీరినప్పుడు ఇచ్చే బోనస్‌లు ఉండవు. కానీ, స్పెషల్ సరెండర్ వాల్యూలో పాలసీ సరెండర్ చేసే సమయానికి సమకూరిన బోనస్‌లు, ఇతర ప్రయోజనాలు కలిపి లెక్కించాల్సి ఉంటుంది.
ఎక్కువ లబ్ధి ఎలా?
సంప్రదాయ ఎంటోమెంట్ పాలసీని సరెండర్ చేసినట్లయితే ఎంతొస్తుందనేది ఒక ఉదాహరణతో తెలుసుకుందాం. మీరు రూ.5 లక్షల సమ్ అష్యూర్డ్‌తో 10 ఏళ్ల పాలసీ తీసుకున్నారు అనుకుందాం. ప్రతి సంవత్సరం రూ.50 వేలు ప్రీమియం కట్టాలి. 4 సంవత్సరాలు కట్టాక సరెండ్ చేద్దాం అనుకున్నారు అనుకుందాం. అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం రూ.2 లక్షలు అవుతుంది. ప్రతి సంవత్సరం రూ.10 వేల బోనస్ వస్తుంది. పాత నిబంధన ప్రకారం 50 శాతం ప్రీమియం వెనక్కి ఇస్తారు. సమ్ అష్యూర్డ్, బోనస్ కలిసి రూ.2.40 లక్షల్లో సగం అంటే రూ. మీకు రూ.1.20 లక్షలు అందుతుంది. అయితే, కొత్త స్పెషల్ సరెండర్ వాల్యూ నిబంధనల ప్రకారం మీకు రూ.1.55 లక్షలు వెనక్కి వస్తాయి.
ఒక వేళ ఇదే పాలసీని మీరు ఏడాది తర్వాతే సరెండర్ చేస్తే పాత నిబంధనల ప్రకారం రూ.50 వేలు కోల్పోవాల్సి వస్తుంది. కానీ, కొత్త రూల్స్ ప్రకారం మీకు రూ.31,295 వరకు చెల్లిస్తారు. ఇది మీ ప్రీమియంలో 62.59 శాతానికి సమానం. ఇలా సమయం గడిచిన కొద్ది పెరుగుతుంది. రెండో ఏడాది సరెండర్ చేస్తే 72.33 శాతం, నాలుగో ఏడాది అయితే 77.76 శాతం, ఐదో సంవత్సరం అయితే 83.59 శాతం, ఆరో సంవత్సరం అయితే 89.86 శాతం, ఏడో ఏట 96.60 శాతం, ఎనిమిదో ఏట 103.84 శాతం, తొమ్మిదో సంవత్సరం 111.63 శాతం బీమా సొమ్ములు మీకు వెనక్కి వస్తాయి.