దిశ, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం HCL కంపెనీ కార్యాలయంలోని వాష్‌రూమ్‌లో ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని ఐటీ సంస్థ HCLలో పనిచేస్తున్న 40 ఏళ్ల సీనియర్ అనలిస్ట్ నితిన్ ఎడ్విన్ మైఖేల్ శుక్రవారం రాత్రి 7 గంటలకు కార్యాలయంలోని వాష్‌రూమ్‌కు వెళ్లాడు. అయితే కాసేపటి తరువాత అతని సహోద్యోగులు లోపలికి వెళ్లి చూడగా కింద పడిపోయి ఉన్నాడు. దీంతో వారు వెంటనే క్యాంపస్ క్లినిక్‌లో అత్యవసర చికిత్స అందించి, పోలీసులకు సమాచారం ఇచ్చి, మైఖేల్‌ను ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)నాగ్‌పూర్‌కు తరలించారు.
అయితే, ఆస్పత్రికి చేరుకోగానే అతను మృతి చెందాడు. సోనెగావ్ పోలీస్ స్టేషన్ అధికారి ఈ ఘటనపై మాట్లాడుతూ, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించామని, ప్రాథమిక శవ పరీక్ష ఫలితాల్లో గుండె పోటు రావడమే అతని మరణానికి కారణమని తేలిందని చెప్పారు. మైఖేల్‌కు భార్య, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. ప్రమాదవశాత్తు మృతి కేసు నమోదు చేసి, ఉద్యోగి మృతికి సంబంధించిన పరిస్థితులపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల కాలంలో పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు చనిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న తరుణంలో, మైఖేల్ మరణానికి కూడా పని ఒత్తిడి కారణం కావచ్చు.. అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఉద్యోగి కుటుంబానికి అన్ని విధాలా సహాయాన్ని అందిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.