దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ దేశాలతో పోలిస్తే, భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో 2032 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి భారత్ సిద్ధంగా ఉందని ఐడీబీఐ(IDBI) క్యాపిటల్ నివేదిక పేర్కొంది. వచ్చే ఆరేళ్లలో ప్రతి 1.5 సంవత్సరాలకు 1 ట్రిలియన్ డాలర్ల చొప్పున భారత జీడీపీకి యాడ్ అవుతుందని, ఈ వృద్ధి ప్రధానంగా తయారీ రంగం, ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి కార్యక్రమాల ద్వారా వస్తుందని నివేదిక తెలిపింది. దేశీయంగా ప్రస్తుత పరిస్థితులు, పెట్టుబడుల ప్రోత్సాహం, ప్రభుత్వం అందించే రాయితీల కారణంగా ఇతర దేశాల చూపు భారత్‌పై పడింది. దీంతో 2030 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుంది. ”మేక్ ఇన్ ఇండియా ” వంటి కీలక కార్యక్రమాలు దేశ తయారీ సామర్థ్యాలను పెంపొందించడంలో, భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నివేదిక హైలెట్ చేసింది.
2030 నాటికి జీడీపీలో 25% ఎగుమతులు 2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటాయని ఐడీబీఐ అంచనా వేసింది. అలాగే, భారత అభివృద్ధి దశలను కూడా ఐడీబీఐ ప్రత్యేకంగా ప్రస్తావించింది. నివేదిక ప్రకారం, 1947 నుండి 2010 వరకు దేశ జీడీపీ $1 ట్రిలియన్‌ని చేరుకోవడానికి 63 సంవత్సరాలు పట్టింది, 2017 నాటికి $2 ట్రిలియన్, 2020 నాటికి $3 ట్రిలియన్‌లను సాధించింది, ఇది గత దశాబ్దంలో వృద్ధిలో తీవ్ర పెరుగుదలను చూపుతుందని పేర్కొంది. కరోనా కారణంగా వృద్ధి కొంత వరకు తగ్గింది. కానీ ఇప్పుడు భారత్ మరింత వేగంగా పుంజుకుంటుంది. తయారీలో బలమైన డిమాండ్, బలమైన ఎగుమతుల కారణంగా 2024-2032 మధ్య, భారతదేశం $10 ట్రిలియన్ల జీడీపీకి చేరుకుంటుందని ఐడీబీఐ అంచనా వేసింది.