దిశ, బిజినెస్ బ్యూరో: మార్కెట్ సరఫరాకు ఇబ్బందుల్లేకుండా ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లతో సహా కొన్ని ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల దిగుమతులకు ఉద్దేశించిన దిగుమతి నిర్వహణ వ్యవస్థను పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ వ్యవస్థ సమీక్షకు గడువు సెప్టెంబర్ 30 ఉండగా, మూడు నెలల పాటు పొడిగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. దిగుమతి నిర్వహణ వ్యవస్థ ద్వారా అనుమతి పొందిన కంపెనీలు 2023-24లో 8.4 బిలియన్ డాలర్ల విలువైన ల్యాప్‌టాప్‌లు, ఇతర ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ దిగుమతుల్లో ఎక్కువ భాగం చైనా నుంచి వచ్చాయి. ఇప్పటికీ దిగుమతి నిర్వహణ వ్యవస్థ అనుమతుల కోసం కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చు. అవి సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతాయి. సెప్టెంబర్ వరకు దిగుమతుల కోసం ఎన్ని సరుకులకైనా అనుమతులు జారీ అవుతాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కాగా, 2023, నవంబర్ 1న, కొత్త సిస్టమ్ అమలులోకి వచ్చిన మొదటి రోజున దాదాపు 10 బిలియన్ డాలర్ల విలువైన ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల దిగుమతుల కోసం అనుమతి కోరిన యాపిల్, డెల్, లెనొవ్ సహా 100 అప్లికేషన్‌లను ప్రభుత్వం క్లియర్ చేసింది. ప్రస్తుతం దీన్ని పొడిగించాలని అభ్యర్థనలు వస్తుండటంతో మూడు నెలల పొడిగించే అవకాశం ఉందని ఓ అధికారి పేర్కొన్నారు.