దిశ, బిజినెస్ బ్యూరో: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) రేట్లలో మార్పులకు సంబంధించి సమీక్షించేందుకు రాష్ట్ర మంత్రుల బృందం ఈ నెల 24-25 తేదీల్లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో గోవాలో జరగనుండగా, సెప్టెంబర్‌లో జరిగిన 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన అంశాలను మంత్రుల బృందం(జీఓఎం) సమీక్షిస్తుంది. అలాగే, వివిధ కేటగిరీల్లోని జీఎస్టీ రేట్లను సర్దుబాటు చేసేందుకు పరిశీలించనున్నారు. జీఓఎం సెప్టెంబర్ 9న జీఎస్టీ కౌన్సిల్‌కు రెండు స్టేటస్ రిపోర్టులను సమర్పించింది. వాటి ఆధారంగా రేట్ల సమీక్షపై జీఓఎం దృష్టి సారిస్తుంది. ప్రస్తుతం జీఎస్టీ నాలుగు స్లాబ్‌ల కింద ఉంది. 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతాలుగా వర్గీకరించారు. నిత్యావసర వస్తువులపై తక్కువ రేట్లను విధిస్తున్నారు. లగ్జరీ వస్తువులపై అధిక జీఎస్టీ అమలవుతోంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ అంశం ప్రతిపాదన దశలో ఉంది. దీనిపై కమిటీని ఏర్పాటు చేయగా, నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.