దిశ, బిజినెస్ బ్యూరో: ఆభారణాల వ్యాపారులు, ప్రజల నుంచి విపరీతమైన డిమాండ్ కారణంగా బంగారం ధరలు మంగళవారం కొత్త రికార్డు గరిష్టాలకు చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 300 పెరిగి రూ. 81,400కి చేరుకున్నాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. పారిశ్రామిక యూనిట్లు, నాణెల తయారీదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో వెండి కూడా కిలో రూ. 99,700కి చేరుకుంది. అయితే, గతంలో ధనత్రయోదశికి ఎక్కువగా బంగారం కొనుగోలు చేసేవారు. కానీ ఈసారి వెండి నాణెలు కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల కారణంగా యూరప్ ట్రేడింగ్‌లో సైతం బంగారం రికార్డు స్థాయికి చేరుకుంది. అమెరికా రుణ సంక్షోభం వల్ల డిమాండ్‌కు మరింత ఆజ్యం పోసింది. దీంతో బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై పెట్టుబడులు పెరుగుతున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ కమొడిటీస్ సీనియర్ విశ్ళేషకులు సౌమిల్ గాంధీ చెప్పారు. ధనత్రయోదశి సందర్భంగా లాంగ్ పొజిషన్‌లలో ఇన్వెస్టర్ల ఆసక్తి పెరగడంతో ఎంసీఎక్‌లో కూడా బంగారం ధరలు సానుకూలంగా ఉన్నాయి. ధనత్రయోదశి సందర్భంగా రిటైల్ మార్కెట్లోనూ పసిడి 24 క్యారెట్లు రూ. 80 వేల కంటే ఎక్కువగా ఉందని నిపుణులు పేర్కొన్నారు.