దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కేంద్రం కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడంతో బాగా తగ్గిన పసిడి మళ్లీ దానికి మించి పెరిగిపోతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ఖరీదవుతున్న పసిడికి, ఇటీవల అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన సాధనాల్లో సొమ్ము పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మంగళవారం నాడు బంగారం 1 శాతంతో రికార్డు స్థాయికి చేరుకుంది. అమెరికా డాలర్ బలహీనత, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చైనాలో వడ్డీ రేటు తగ్గింపుల మధ్య పసిడి రికార్డు గరిష్ట స్థాయికి చేరింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ. 600కి పైగా పెరిగి రూ. 77,020కి చేరింది. వివిధ రకాల పన్నులు కలుపుకుని ఇది దాదాపు రూ. 77,900 ఉండొచ్చు. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి రూ. 70,600కి పెరిగింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి పశ్చిమాసియాలో వరుసగా కొనసాగుతున్న యుద్ధ భయాలతో బంగారం ధర 2024లో ఇప్పటివరకు 28 శాతం పెరిగింది. వెండి కూడా రూ. 3000 పెరిగి కిలో రూ. 1,01,000 చేరుకుంది. జీఎస్టీ లాంటి పన్నులు కలుపుకుంటే ఇది ఇంకా ఎక్కువ కావొచ్చు. రానున్న రోజుల్లో అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను ఇంకా తగ్గించవచ్చనే అంచనాలు, భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావం కూడా బంగారం ధరలు పెరిగేందుకు కారణంగా అనలిస్టులు వెల్లడించారు.