దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) టెక్నాలజీతో పాటు సంబంధిత ఉత్పత్తులు, సేవలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత వేగంగా ఏఐ మార్కెట్ పెరగనుందని ఓ నివేదిక తెలిపింది. ప్రముఖ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ బైన్ అండ్ కంపెనీ తాజాగా రూపొందించిన 5వ వార్షిక గ్లోబల్ టెక్నాలజీ రిపోర్ట్ ప్రకారం.. 2027 నాటికి గ్లోబల్ ఏఐ మార్కెట్ 990 బిలియన్ డాలర్లకు(రూ. 83 లక్షల కోట్ల) చేరుకుంటుందని అంచనా వేసింది. ముఖ్యంగా ప్రపంచ ఏఐ మార్కెట్ వార్షిక వృద్ధి 40-45 శాతంగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఏఐ మార్కెట్ విలువ రూ. 65.2 లక్షల కోట్లుగా ఉంది. 2027 నాటికి ఏఐ పనిభారం ఏడాదికి 25-35 శాతం మేర పెరిగే అవకాశాలు ఉన్నాయి. సరఫరా, డిమాండ్ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఏఐ మార్కెట్ స్థిరంగా, దీర్ఘకాలం మెరుగ్గా వృద్ధి సాధించవచ్చని నివేదిక వివరించింది. ఏఐ విస్తరిస్తున్న కొద్దీ కంప్యూటింగ్ పవర్ అవసరం వచ్చే ఐదు పదేళ్లలో భారీ డేటా సెంటర్లను సమూలంగా మార్చనుంది. ప్రస్తుతం డేటా సెంటర్ల కోసం అయ్యే ఖర్చు రూ. 8,350 కోట్లు ఉండగా, 2027 నాటికి ఇది రూ. 33.5 వేల కోట్ల(నాలుగు రెట్లు)కు పెరగనుంది. ఇదే సమయంలో ఏఐ మార్కెట్‌కు కీలకమైన సెమీకండక్టర్ల కొరత కొంత ప్రతికూలంగా మార్చవచ్చని నివేదిక పేర్కొంది.