రెండో సంతానం వారే 90 శాతం
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంట ల్లో లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గం భౌగోళికంగా కరీంనగర్ జిల్లాలోనే ఉన్నప్పటికీ.. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ జిల్లాలతో సరిహద్దు పంచుకుంటోంది. ఇక్కడ వైద్య పరీక్షల్లో ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ (భ్రూణ హత్య) చేయడం కొంతమంది వైద్య సిబ్బందికి దందాగా మారింది. అబార్షన్ చేయించుకుంటున్న వారిలో రెండో సంతానం ఆడపిల్ల అని తెలుసుకున్న వారే 90శాతం మంది ఉంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి హుజూరాబాద్, జమ్మికుంటలకు వస్తున్నారు. వీరిలో ఇదివరకే ఇద్దరు ఆడపిల్లలు ఉండి, మగ సంతానం కోసం వస్తున్న 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న దంపతులు ఉండటం గమనార్హం. అప్పటికే వీరు వేసక్టమీ, ట్యూబెక్టమీ చేయించుకున్నా.. తిరిగి ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ఇలాంటి వారికి ఈ రెండు ప్రాంతాలు మగపిల్లలను కనేందుకు కేంద్రాలుగా మారాయంటే అతిశయోక్తి కాదు. ఈ దందా చేసేవారికి, చేయించుకునేవారికి కొందరు ఆర్ఎంపీలు వారధిగా ఉంటున్నారు. గత జూన్ లో హుస్నా బాద్ పోలీసులు ఓ ఆర్ఎంపీని, ప్రైవేటు ఆస్పత్రి పీఆర్వోను అరెస్టు చేశారు.