దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో కొనుగోళ్ల సందడి కనిపించబోతుంది. ముఖ్యంగా ఆఫ్‌లైన్ వ్యాపారాలతో పాటు ఆన్‌లైన్ కొనుగోళ్లు ఎక్కువగా పుంజుకుంటున్నాయి. తాజాగా మార్కెట్ పరిశోధన సంస్థ డాటమ్ నివేదిక ప్రకారం, రాబోయే పండుగ సీజన్‌లో ఈ-కామర్స్ అమ్మకాలు సంవత్సరానికి 23 శాతం పెరిగి రూ. 1 లక్ష కోట్లకు ($12 బిలియన్) చేరుకోవచ్చని అంచనా. ముఖ్యంగా ఈ అమ్మకాల్లో మొబైల్ ఫోన్‌లు, ఫ్యాషన్ వంటి పెద్ద కేటగిరీలతో పాటు కిరణా సామాగ్రి వంటి వాటికి ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.
సాధారణంగా భారత్‌లో ఆగస్టు నెల రాకతో పండుగలు మొదలవుతాయి. ప్రాంతాల వారీగా ముఖ్యమైన పండుగలకు అమ్మకాలు జోరుగా ఉంటాయి. దసరా, దీపావళి సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్‌తో పాటు ఆఫ్‌లైన్ షాపింగ్ సైతం గరిష్ట స్థాయికి చేరుకుని, క్రిస్మస్ వరకు కొనసాగుతుంది. పరిశ్రమ అంచనాల ప్రకారం భారతదేశంలో మామూలు రోజుల్లో కంటే పండుగ విక్రయాలు రెండింతలు వేగంగా పెరుగుతున్నాయి.
వివిధ ఈ కామర్స్ సంస్థలు మార్కెట్ వాటాను పొందేందుకు తగ్గింపులు, ఆఫర్‌లతో వినియోగదారులను అట్రాక్ట్ చేయడం ద్వారా మార్కెట్లో అగ్రస్థానంలో ఉండటానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం కొనుగోలు వాల్యూమ్‌ల పరంగా టాప్ 3.. ఫ్లిప్‌కార్ట్, మీషో, అమెజాన్ ఉన్నాయి. ఈ కంపెనీలతో పాటు ఇతర కంపెనీలు సైతం మార్కెట్లో పోటీ పడుతున్నాయి.