Congress Guarantees: గుడ్‌న్యూస్ చెప్పిన కాంగ్రెస్.. నెలకు రూ.6వేలు పెన్షన్, 100 గజాల భూమి

By Margam

Published on:

Follow Us
Congress Guarantees: గుడ్‌న్యూస్ చెప్పిన కాంగ్రెస్.. నెలకు రూ.6వేలు పెన్షన్, 100 గజాల భూమి


Telegram Channel Join Now
Congress Guarantees: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీ వరాల జల్లు కురిపించింది. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసేలా 7 గ్యారెంటీలను హస్తం పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్ర అభివృద్ధితోపాటు ప్రజల సంక్షేమానికి హస్తం పార్టీ పెద్ద పీట వేస్తుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఖర్గేతోపాటు కాంగ్రెస్‌ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌, హర్యానా మాజీ సీఎం భూపేంద్ర సింగ్‌ హుడా, హర్యానా పీసీసీ చీఫ్‌ ఉదయ్‌భాన్‌ పాల్గొన్నారు.

హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రజలకు మెరుగైన పరిపాలన, ప్రజా సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందిస్తామని ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. హర్యానాలో అవినీతి రహిత పాలనను అందిస్తామని.. రైతులు, కార్మికులు, యువత, మహిళలు, ఉద్యోగుల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ కీలక చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగానే తాము అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలు, హామీలను మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు.

  • 18 ఏళ్ల నుంచి 60 ఏళ్లు ఉన్న మహిళలందరికీ నెలకు రూ. 2000
  • అర్హులైన వారికి రూ.500లకే గ్యాస్ సిలిండర్
  • వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు నెలకు రూ.6000 పెన్షన్
  • అర్హులైన వారికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
  • అర్హులైన వారికి ఉచితంగా 100 గజాల ప్లాట్లు, శాశ్వత గృహాలు
  • చిరంజీవి పథకం కింద రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్స
  • రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత
  • ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం(OPS ) అమలు
  • ప్రభుత్వ శాఖల్లో 2 లక్షల ఉద్యోగాల భర్తీ
  • డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా హర్యానాను తీర్చిదిద్దడం, స్మగ్లర్లపై కఠిన చర్యలు
  • హర్యానాలో అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన
  • క్రిమీలేయర్‌ను ప్రస్తుతం ఉన్న రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు

హర్యానా అసెంబ్లీకి అక్టోబర్‌ 5వ తేదీన ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌, బీజేపీ, జేజేపీ పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు హర్యానాలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. మరోవైపు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇటీవల హర్యానాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.

Source link

Leave a Comment