దిశ, నేషనల్ బ్యూరో : ‘భారత్ పే’ నిధుల దారిమళ్లింపు కేసులో ఆ కంపెనీ సహ వ్యవస్థాపకుడు అశ్నీర్ గ్రోవర్ కుటుంబ సభ్యుడు దీపక్ గుప్తా అరెస్టయ్యారు. ఢిల్లీ పోలీసులకు చెందిన ఆర్థిక నేరాల విభాగం ఆయనను అరెస్టు చేసింది. ఈవివరాలను ఢిల్లీ పోలీసు విభాగం శుక్రవారం సాయంత్రం వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించిన అంశాలపై ప్రశ్నించిన తర్వాతే దీపక్ గుప్తాను అరెస్టు చేసినట్లు తెలిపింది.
అశ్నీర్ గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్, శ్వేతాంక్ జైన్ (మాధురి సోదరుడు), సురేశ్ జైన్ (అశ్నీర్ మామయ్య)లపై 2023 మేలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లోనూ దీపక్ పేరును పోలీసులు ప్రస్తావించారు. మాధురీ జైన్ సోదరి భర్తే ఈ దీపక్ గుప్తా. భారత్ పేకు చెందిన దాదాపు రూ.81 కోట్ల నిధులను కల్పిత వెండర్లు, హెచ్‌ఆర్ కన్సల్టెన్సీలకు చెల్లించడం ద్వారా అశ్నీర్ గ్రోవర్ దారిమళ్లించారనే అభియోగాలను పోలీసులు నమోదు చేశారు. దీనిపై భారత్ పే కంపెనీ 2022 డిసెంబరులో పోలీసులకు ఫిర్యాదు చేసింది.