కరీంనగర్ లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదులో ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి పాల్గొన్న బండి సంజయ్ కాంగ్రెస్ తీరు, బీఆర్ఎస్ వైఖరిపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విరక్తి మొదలయ్యిందని, అతి తక్కువ కాలంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటుందని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా హైడ్రా పేరుతో డైవర్ట్ చేస్తూ హైడ్రామాలాడుతుందని విమర్శించారు. పెద్దలు అక్రమంగా కట్టుకున్న భవనాలను, విల్లాలను, ఫాంహౌజ్ లను కూలిస్తే సమర్ధించానని, కానీ పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే షాపులను, పేదల ఇండ్లను కూలుస్తుండడం సరికాదన్నారు. హైడ్రా వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని విమర్శించారు. అక్రమ భవనాలకు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కడుతున్న ఇండ్లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడెందుకు కూలుస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని, పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.