హైద‌రాబాద్ లో ఇరాన్ ప‌ర్యాట‌క రోడ్ షో 

By Margam

Published on:

Follow Us
హైద‌రాబాద్ లో ఇరాన్ ప‌ర్యాట‌క రోడ్ షో 



Telegram Channel Join Now

  • హాజరైన ఇరాన్ డిఫ్యూటి మంత్రి షల్బాఫియాన్,  మంత్రి జూప‌ల్లి, ఇరాన్ కాన్సుల్ జ‌న‌ర‌ల్ మైదీ  

ముద్ర, తెలంగాణ బ్యూరో : –శతాబ్దాలుగా భార‌త‌దేశానికి ఇరాన్‌తో చారిత్ర‌క‌, సాంస్కృతిక అనుబంధం ఉంద‌ని,  భార‌త్ తో సాంస్కృతిక, పర్యాటక సంబంధాల మార్పిడిని మరింత వేగవంతం చేసుకొనేందుకు పర్యాట‌క‌ నూతన విధానం అమలు చేస్తున్నట్టు  ఇస్లామిక్ రిప‌బ్లిక్ ఆఫ్ ఇరాన్ ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, వార‌స‌త్వ శాఖ డిఫ్యూటి మంత్రి షల్బాఫియాన్ అన్నారు. ఇరాన్ – భార‌త‌దేశం, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క రంగాల్లో ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోవ‌డం ల‌క్ష్యంగా  హైద‌రాబాద్ లోని ఓ హోట‌ల్ లో గురువారం ఇరాన్  ప‌ర్యాట‌క రోడ్ షో ఈవెంట్ ను నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా షల్బాఫియాన్ మాట్లాడుతూ…  ఇరాన్ ప‌ట్ల సానుకూల వాతావ‌ర‌ణాన్ని ప్ర‌మోట్ చేయ‌డం,  అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌కుల‌ను ర‌ప్పించ‌డం,  కొత్త వ్యాపార అవ‌కాశాల‌ను సృష్టించ‌డం, సాంస్కృతిక అనుబంధాన్ని మ‌రింత విస్త‌రించ‌డ‌మే ల‌క్ష్యంగా భార‌త‌దేశంలో ప‌ర్యాట‌క రోడ్ షో నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. సంద‌ర్శ‌కుల మార్పిడి వ‌ల్ల  రెండు దేశాల్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్, భారతదేశం మధ్య లోతైన సాంస్కృతిక, కళాత్మక సంబంధాలు ఉన్నాయని, ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌రంతో కూడా ఇరాన్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంద‌ని, హైద‌రాబాద్ రెండు దేశాలను కలిపే వారధిగా నిలుస్తుంద‌ని అభివ‌ర్ణించారు. ఇరాన్ దేశంలోని  చారిత్ర‌క‌, వార‌స‌త్వ‌,  ప‌ర్యాట‌క ప్రాంతాల్లో ప‌ర్య‌టించి, పాశ్య‌త్య దేశాలు,  మీడియా చిత్రీక‌రించిన దానికి భిన్నంగా ఇరాన్  ఉంద‌ని తెలుసుకుంటార‌ని పేర్కొన్నారు. 

ఇండియా – ఇరాన్  ప‌ర్యాట‌కులు రెండు దేశాల్లో పర్యటించ‌డం వ‌ల్ల  ఇరు దేశాల మ‌ధ్య సంబంధాలు మ‌రింత బ‌ల‌ప‌డతాయ‌ని, ప‌ర‌స్ప‌రం ఒక‌రినొక‌రు అర్థం చేసుకోవ‌డం, సాంస్కృతిక మార్పిడి జ‌రుగుతుంద‌ని హైద‌రాబాద్ లో ఇస్లామిక్ రిప‌బ్లిక్ ఆఫ్ ఇరాన్ కాన్సుల్ జ‌న‌ర‌ల్ మైదీ ష‌హారొఖి తెలిపారు. 

అనంతరం మంత్రి జూప‌ల్లి మాట్లాడుతూ…  ఇరాన్ సాంస్కృతిక సంపద గురించి మరింత లోతుగా తెలుసుకోవటానికి, ఇరు దేశాల మధ్య పర్యాటక సంబంధాలను బలోపేతం చేయటానికి ఈ రోడ్ షో ఒక గొప్ప వేదికగా నిలిచింద‌ని అన్నారు. ఇరాన్ పర్యాటక ఆకర్షణలపై అవగాహన కల్పించుకునే అవ‌కాశం ల‌భించింద‌ని తెలిపారు.  ప్రపంచ పర్యాటక పటంలో తెలంగాణ ఒక ప్రముఖ గమ్యస్థానంగా ఉద్భవించిందని చెప్పారు. రేవంత్ రెడ్డి  నాయకత్వంలో తెలంగాణ ప‌ర్యాట‌క అమ‌లు చేస్తున్న  చురుకైన విధానాలు, కార్యక్రమాలు పర్యాటకాన్ని ప్రోత్సహించడం, మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించాయని వివ‌రించారు.  పర్యాట‌కుల‌కు మెరుగైన మౌతిక స‌దుపాయాల క‌ల్పించేందుకు, , వారసత్వ పరిరక్షణ, స్థానిక కళలు, హ‌స్త‌క‌ళ‌లు ప్రోత్స‌హించేందుకు కృషి చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు.హైదరాబాద్ యొక్క సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని, కుతుబ్ షాహీ రాజవంశం యొక్క శాశ్వత వారసత్వాన్ని పరిరక్షించడానికి  కుతుబ్ షాహీ సమాధుల పునరుద్ధరించ‌డం మా నిబద్ధతకు నిదర్శనమ‌ని పేర్కొన్నారు. 

ఇరాన్ సాంస్కృతిక సంపదను తెలుసుకోవడానికి, రెండు ప్రాంతాల మధ్య పర్యాటక సంబంధాలను బలోపేతం చేయటానికి ఇదొక గొప్ప వేదిక అని, తెలంగాణ అందాల‌ను చూపించ‌డానికి ఈ రోడ్ షో వ‌ల్ల అవ‌కాశం ల‌భించిందని అన్నారు. పర్యాటకం వ‌ల్ల కేవలం కొత్త ప్రదేశాలను సందర్శించడం మాత్రమే కాదని, మనుషులతో సంబంధాలు ఏర్పరచడం, వేరే సంస్కృతులను అర్థం చేసుకోవడం, కొత్త ప‌రిచ‌యాలు ఏర్ప‌ర‌చుకోవ‌డంతో పాటుఆర్థిక అభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ, ప్రపంచ శాంతి కోసం శక్తివంతమైన సాధనంగా నిలుస్తుంద‌ని వెల్ల‌డించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, ఇరాన్ కాన్సులేట్ సెకండ్ కన్సుల్ మోహసిన్ మొగద్దమి,  ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ టూరిజం డైరెక్ట‌ర్ జ‌నర‌ల్ షోజేహి, రిజీనల్ పాస్పోర్ట్ అధికారి స్నేహజ, తెలంగాణ పర్యాటక శాఖ డైరెక్టర్ ఇలా త్రిపాఠి, వివిధ ట్రావెల్స్ సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Source link

Leave a Comment