హైదరాబాద్ నగరవాసులకు వాటర్ బోర్డ్ అధికారులు అలర్ట్ జారీ చేశారు. నగరంలో నేడు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. కృష్ణానది డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ఫేజ్-1లోని పైప్‌లైన్ లీకేజీ అయినట్లు తెలిపారు. దేవత్‌పల్లి వద్ద 300 MM డయా ఎయిర్ వాల్వ్‌లో ఆకస్మికంగా భారీ లీకేజీ జరిగిందని అన్నారు. ఈ లీకేజీ కారణంగా నగరంలో పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు.ప్రస్తుతం లీకేజీ మరమ్మతులను చేపట్టినట్లు తెలిపారు. నేడు సాయంత్రానికి ఆ లీకేజీకి అడ్డుకట్ట వేస్తామని అన్నారు. ఇప్పటికే సిబ్బంది ఆయా పనుల్లో నిమగ్నమైనట్లు చెప్పారు. ఎయిర్ వాల్వ్ లీకేజీ కారణంగా సైదాబాద్, చంచల్‌గూడ, యాకుత్‌పురా, ఆలియాబాద్, మిరాలం, కిషన్ బాగ్, సంతోష్‌నగర్, వినయ్‌నగర్, బొగ్గులకుంట, అప్జల్‌గంజ్, చిలకలగూడ, నారాయణగూడ, అడిక్‌మెట్, శివంరోడ్, నల్లకుంట, దిల్‌సుఖ్‌నగర్, మన్నెగూడ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
నీటి వారోత్సవాల్లో మంత్రి ఉత్తమ్.. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో బుధవారం జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 8వ అంతర్జాతీయ నీటి వారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతర్జాతీయంగా నీటి నిర్వహణ, అభివృద్ధి, సహకారం వంటి కీలకమైన అంశాలపై కార్యక్రమంలో చర్చించారు. జలవనరుల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ సదస్సులో ప్రదర్శించారు.
తీరనున్న నీటి కష్టాలు.. ఇక ఈ ఏడాది హైదరాబాద్‌లో నీటి కష్టాలు తీరనున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరానికి నీటిని అందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండు కుండలా మారాయి. దాంతో పాటుగా గండిపేట చెరువుకు కూడా భారీగా వరద వచ్చింది. దీంతో నగరంలో గ్రౌండ్ వాటర్ లెవల్ పెరిగి పుష్కలంగా నీరు అందుబాటులో ఉంటుందని నిపుణులు అంటున్నారు.