హైడ్రా పేరుతో రేవంత్ రాజకీయం –  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ 

By Margam

Published on:

Follow Us
హైడ్రా పేరుతో రేవంత్ రాజకీయం –  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ 



Telegram Channel Join Now

  • హైడ్రా పేరుతో రేవంత్ రాజకీయం
  • అనుమతులు ఉన్న భవనాలు కూల్చడమేమిటీ ?
  • ప్రజల ఆస్తులను కూలగొట్టొద్దు
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసింది
  • దీన్ని సాకుగా తీసుకుని కాంగ్రెస్ సర్కార్ రాజకీయం చేస్తోంది

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మండిపడ్డారు.  అన్ని రకాల అనుమతులు ఉన్న భవనాలను కూల్చడమేమిటని ఆయన నిలదీశారు. జీహెచ్ ఎంసీ పరిధిలో ప్రస్తుతం అక్రమ కట్టడాలు అంటున్న ప్రాంతాల్లో వెలసిన ఇండ్లకు ప్రభుత్వం తరపున కోట్ల రూపాయలు ఖర్చు చేసి వేసిన రోడ్లు, వీధిలైట్లు, కల్పించిన తాగునీటి వసతులు, డ్రైనేజీ సౌకర్యం, కరెంట్ కనెక్షన్లు, కమ్యూనిటీ హాళ్లు, ఇంటి నెంబర్ ను కేటాయించిన విషయం వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. హఠాత్తుగా అక్రమం అంటే వాళ్లు ఎక్కడకు వెళ్లాలి? పేద, మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి? పేద, మధ్యతరగతి ప్రజలు అప్పులు చేసి, బ్యాంకు రుణాలు తీసుకుని.. ప్లాట్లు, అపార్టు‌మెంట్లు కొనుక్కున్నారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అధికారిక అనుమతులు ఉన్న భవనాల్ని కూడా నేలమట్టం చేయటం బాధాకరమన్నారు.  ప్రజలకు ఉపయోగపడే కట్టడాలు నిర్మించాల్సిందిపోయి, ప్రభుత్వమే ఇప్పడు కూల్చివేతలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న నిర్మాణాలను తొలగించేందుకు సరైన ప్రణాళిక లేకుండా ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

కూల్చివేతలపై పేద ప్రజల ఆవేదనను పట్టించుకోకుండా , కేవలం మంత్రివర్గ సమావేశంలో హైడ్రాకు మరిన్ని అధికారాలను కట్టబెట్టడం దారుణమన్నారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ నగర పరిసరాలలో హైడ్రా ఆధ్వర్యంలో జరుపుతోన్న కూల్చివేతలపై పునరాలోచన చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాశారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో  హైడ్రా పేరుతో ఓ విభాగాన్ని ఏర్పాటుచేసి, పేదలను రోడ్డుపాలు చేస్తున్నారన్నారు. సాధారణంగా.. ప్రభుత్వాలేవైనా నిర్మాణాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాయని అన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా పేదలకు నిలువ నీడ నిచ్చే ఇండ్లు, రోడ్లు, భవనాలు, బ్యారేజీలు, బ్రిడ్జ్‌లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు కట్టడం, ప్రజలకు ఉపయోగపడే ఇతర నిర్మాణాలపై దృష్టి సారించి ప్రజలకు మేలుచేసేందుకు ప్రయత్నిస్తాయన్నారు. మీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా  కూల్చివేతల ద్వారా పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నట్లు అర్థమవుతోందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. కనీస ప్లానింగ్ లేకుండా విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఆయన ఆరోపించారు. దీన్ని సాకుగా తీసుకుని కాంగ్రెస్ సర్కార్.. నిర్మాణాత్మక ఆలోచనలకు, ప్రజోపయోగ మౌలికవసతుల నిర్మాణానికి డబ్బుల్లేవన్న కారణాలు చూపుతోందన్నారు. ఎలాంటి ప్రణాళిక లేకుండానే, హడావుడి చేసి నిత్యం వార్తల్లో ఉండే లక్ష్యంతో అక్రమ కట్టడాల పేరిట ఇండ్లను కూల్చివేసే మార్గాన్ని ఎంచుకుందని దుయ్యబట్టారు.

ఈ ప్రక్రియను.. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చేపట్టి ఉంటే బాగుండేదని తెలంగాణ ప్రజల అభిప్రాయపడుతున్నారని ఆయన గుర్తు చేశారు. బాధితుల ఆందోళనలు, మేధావుల ఆలోచనలను పరిగణనలోనికి తీసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. దీనికి ఓ స్పష్టమైన విధానం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆక్రమణలను, అక్రమ నిర్మాణాలను మేం సమర్థించం కాకపోతే వీటిపై చర్యలు తీసుకునే సమయంలో చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉండాలన్నారు. ప్రభుత్వానికి సమగ్ర ప్రణాళిక ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజాయితి, పారదర్శకత, మానవత్వం, సామాజిక బాధ్యత, నిర్మాణాత్మక నియమ నిబంధనలు ఉండాలి. మూసీ పరివాహక ప్రాంతంలో 15 వేలకు పైగా పేద, మధ్య తరగతి కుటుంబాలున్నాయి. వారి నివాసాలను హైడ్రా ద్వారా కూల్చేముందు.. వారితో చర్చించాలని కేంద్ర మంత్రి సూచించారు.

Source link

Leave a Comment