గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కూల్చివేతలపై నగర ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చెరువులను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను కూల్చాలని కొందరు అంటుండగా.. పేదల ఇండ్లు నిర్మించుకోవటానికి అక్కడ పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు కూల్చేస్తారా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలకు బయపడి కూకట్‌పల్లి శేషాద్రి నగర్ ప్రాంతానికి చెందిన బుచ్చమ్మ అనే మహిళ రెండ్రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. తన ముగ్గురు కూతుళ్లకు రాసిచ్చిన ఇండ్లు కూల్చేస్తారేమోనని భయపడి ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో కేసు నమోదయింది. హైడ్రా అధికారులు ఇళ్లు కూల్చేస్తారన్న భయంతో తమ తల్లి సూసైడ్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. దీంతో 16063/IN/224 కింద రంగనాథ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు NHRC తెలిపింది. కాగా బుచ్చమ్మ మరణానికి, హైడ్రాకు సంబంధం లేదని రంగనాథ్ ఇప్పటికే ప్రకటించారు. ఆమె ఇంటికి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. తాను కూకట్‌పల్లి సీఐతో మాట్లాడానని.. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. బుచ్చమ్మ మరణానికి హైడ్రాకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు.
హైడ్రా ఈ నగరానికి ఒక భరోసా అని.. పర్యావరణ పరిరక్షణతో నగర ప్రజలకు మెరుగైన జీవనం కల్పించే బాధ్యతాయుతమైన పాత్ర హైడ్రాదని అన్నారు. అనవసరంగా ఒక బూచిగా.. రాక్షసిగా చూపించవద్దని కోరారు. నగర ప్రజలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవనం సాగించే హక్కును కాపాడడం. అందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైడ్రాను తీసుకువచ్చారన్నారు. ప్రకృతి విధ్వంశం చేసి జీవన ప్రమాణాలు దెబ్బతీసేవారిపై చర్యలకు హైడ్రా తీసుకుంటుందని చెప్పారు.