అయితే కొన్ని పథకాలకు వడ్డీ రేట్లను కేంద్రం పెంచుతుందని ఊహించనిప్పటికీ నిరాశే ఎదురైంది. ఏ పథకం వడ్డీ రేట్లను మార్చలేదు. యథాతథంగా ఉంచుతున్నట్లు వెల్లడించింది కేంద్రం. అయితే ఆర్బీఐ త్వరలో రెపో రేట్లను తగ్గించే అవకాశాలు కనిపిస్తుండగా.. ఇదే సమయంలో ఈ పథకాల వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయని తెలుస్తోంది. అదే జరిగితే ఇన్వెస్టర్లకు ఇంకా తక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పొచ్చు.
ఈ క్రమంలోనే అత్యంత ఆదరణ పొందిన స్కీమ్.. సుకన్య సమృద్ధి యోజన ఇన్వెస్టర్లకు నిరాశే మిగిలింది. వడ్డీ రేట్లను ఇక్కడ పెంచి చాలా త్రైమాసికాలు గడుస్తున్న క్రమంలో ఈసారి స్వల్పంగా పెంచుతుందని భావించగా అలా జరగలేదు. దీంతో అక్టోబర్- డిసెంబర్‌లోనూ ఈ పథకం వడ్డీ రేటు 8.20 శాతంగానే ఉంటుంది. ఈ పథకంలో పదేళ్లలోపు వయసున్న బాలికలే చేరాల్సి ఉంటుంది. వరుసగా 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలి. అకౌంట్ తెరిచిన 21 ఏళ్లకు మెచ్యూరిటీ వస్తుంది. ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250 తో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టేందుకు ఛాన్స్ ఉంటుంది.
ఈ పథకంలో బాలిక 18 సంవత్సరాలు నిండినా లేదా పదో తరగతి పూర్తయినా అప్పుడు 50 శాతం వరకు డబ్బులు తీసుకోవచ్చు. 18 ఏళ్లు దాటి పెళ్లైతే.. అప్పుడు పూర్తి డబ్బులు తీసుకోవచ్చు. ఇందులో టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షలు వరకు పన్ను తగ్గించుకోవచ్చు.
ఈ పథకంలో మనం ఏడాదికి గరిష్టంగా లక్షా 50 వేల వరకు కట్టొచ్చు.. దీనిని ఒకేసారి లేదా ఇన్‌స్టాల్‌మెంట్ల రూపంలో డిపాజిట్ చేయొచ్చు. ఇక ఉదాహరణకు మనం నెలకు రూ. 10 వేల చొప్పున ఏటా రూ. 1.20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎంత వస్తుందో చూద్దాం. 2024లో ఏడాది వయసులోనే చేరితే.. నెలకు రూ. 10 వేలు ఇలా ఏడాదికి రూ. 1.20 లక్షలతో చూస్తే.. మొత్తం పెట్టుబడి రూ. 18 లక్షలు అవుతుంది. అకౌంట్ 2045లో మెచ్యూర్ అవుతుంది. వడ్డీతోనే రూ. 37,42,062 వస్తుంది. ఇలా మొత్తం చేతికి రూ. 55,42,062 వస్తుంది. గరిష్ట పెట్టుబడి అయిన రూ.1.50 లక్షలతో అయితే.. ఏకంగా రూ. 69,27,578 చేతికి అందుతుంది. అందుకే పాప పుట్టినప్పుడే ఈ స్కీంలో చేరితే 21 ఏళ్లు లేదా పెళ్లి వయసు వచ్చే వరకు చేతికి పెద్ద మొత్తంలో అందుకోవచ్చు.