ముద్ర.వీపనగండ్ల :- మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని వీపనగండ్ల ఎస్సై కే రాణి అన్నారు. వీపనగండ్ల ఎస్సైగా కే రాణి శనివారం బాధితులు స్వీకరించారు. స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న నందికర్ గద్వాల జిల్లా మల్దకల్ మండల ఎస్సైగా బదిలీపై వెళ్ళగా, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో షీ టీం లో విధులు నిర్వహిస్తున్న కే రాణి బదిలీపై వచ్చి వీపనగండ్ల మండల ఎస్సైగా కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. మండలం ఏర్పడిన తర్వాత వీపనగండ్ల పోలీస్ స్టేషన్ కు మహిళ ఎస్సైగా రావడం ఇదే మొదటిసారి.
ఈ సందర్భంగా ఎస్సై కె రాణి మాట్లాడుతూ వినాయక మండపాల వద్ద డిజె సౌండ్ బాక్స్ లకు అనుమతి లేదని,నిర్వాహకులు నిబంధనలు అతిక్రమించి డీజే బాక్సులు వాడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా ఉన్నత చదువులు చదువుతూ ఉపాధి మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. మండలంలో అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.