- ఈ నెల 27 వరకు బిడ్స్ స్వీకరణ
- ఆఫ్ లైన్ లో టెండర్లు
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా.. తాజాగా కూల్చేసిన భవన నిర్మాణాల వ్యర్థాల తొలగింపుపై దృష్టి పెట్టింది. వాటిని ఆయా స్థలాల నుంచి తొలగించే బాధ్యతను కూడా తీసుకుని టెండర్లకు ఆహ్వానించింది. ఈ మేరకు కూల్చివేతల వ్యర్థాలను తొలగించేందుకు ఆఫ్ లైన్లో టెండర్లను ఆహ్వానిస్తూ గురువారం ప్రకటన జారీ చేసింది.అందులో ఈ నెల 27 వరకు బిడ్స్ స్వీకరించనున్నట్లు తెలిపింది.
టెండర్లలో పాల్గొనాలని భావిస్తున్న దరఖాస్తులు బుద్ధభవన్లోని ఏడో అంతస్తులోని హైడ్రా కార్యాలయంలో సంప్రదించాలని సూచించింది. ఏడాది కాల పరిమితితో బిడ్స్ ధృవీకరిస్తున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. బిడ్స్ దాఖలు చేసే కాంట్రాక్టర్లు తమ ప్రతిపాదనలను సీల్డ్ కవర్లలో సమర్పించాలని సూచించారు. కాగా గడిచిన రెండు నెలల్లో 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా 111 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.