జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న ఇందిరమ్మ రాజ్యంలో పాత్రికేయులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని.. అలాగని పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించొద్దని జర్నలిస్టులకు సూచనలు చేశారు. రాజకీయ పార్టీలే ప్రస్తుతం పత్రికలు నడుపుతున్నాయని.. అందులోని జర్నలిస్టులు పార్టీలకు కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. నిజమైన జర్నలిస్టులపై ఈ విధానానికి స్వస్తి పలకాల్సిన బాధ్యత ఉందని.. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీకి, సెక్రటేరియట్‌కు జర్నలిస్టులు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం చిట్‌చాట్‌లూ జరిపే పరిస్థితి వచ్చిందన్నారు.
జేఎన్‌జే హౌసింగ్ సొసైటీ ఇళ్ల స్థలాల సమస్య 18 ఏళ్లుగా ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కారం చూపిందన్నారు రేవంత్ రెడ్డి. అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, హెల్త్‌కార్డులు అందిస్తామని చెప్పారు. ఢిల్లీలో పనిచేసే తెలుగు జర్నలిస్టులకు కూడా వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కొందరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని.. ముఖ్యమంత్రిని అగౌరవపరిచేలా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలను నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవద్దని సూచించారు రేవంత్ రెడ్డి.
రాష్ట్రంలో పత్రిక, ఛానల్, సీనియారిటీ ప్రాధాన్యంలో ప్రజాప్రతినిధులను కలిసేందుకు.. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు కొన్ని నిబంధనలనున రూపొందించుకోవాని సూచన చేశారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో చిన్న, పెద్ద పత్రికలను ఎలా గుర్తించాలో ఒక నివేదిక తయారు చేయాలని.. ప్రెస్ అకాడమీకి ప్రత్యేక నిధి కింద రూ.10 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసి.. విధివిధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే రాష్ట్రంలో మిగతా జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు.