‘త్వరలోనే ఈ విధానం ముంబయి, చెన్నై, కోల్‌కతా విమానాశ్రయాల్లో అందుబాటులోకి వస్తుంది.. ముందస్తు బయోమెట్రిక్ పూర్తిచేసుకున్న భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డ్ హోల్డర్లకు సెకన్లలోనే ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది.. వేగవంతమైన, మరింత సురక్షితమైన ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్‌తో అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేయడం దీని ప్రధాన లక్ష్యం’అని అధికారులు పేర్కొన్నారు. ఈ విధానం ఢిల్లీ విమానాశ్రయంలో విజయవంతమైందని, 18,400 మంది ప్రయాణికులు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు.
ఎఫ్టీఐ-టీటీపీ అమలు
ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా FTI-TTP అమలు చేస్తారు. ఈ కార్యక్రమం కింద వివిధ వర్గాల ప్రయాణికుల ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ కోసం బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. అవసరమైన ధ్రువీకరణ పూర్తయిన ప్రయాణికులు ఇ-గేట్‌ల ద్వారా ‘ట్రస్టడ్ ట్రావెలర్స్’ వైట్ లిస్ట్‌తో అనుసంధానమవుతారు. వీరి బయోమెట్రిక్‌లను విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లేదా విమానాశ్రయాల్లో తీసుకుంటారు.
ఇలా వివరాలను నమోదుచేసుకున్న ప్రయాణీకులు.. ఇ-గేట్‌లను చేరుకున్నప్పుడు.. ప్రయాణానికి జారీ చేసిన బోర్డింగ్ పాస్, పాస్‌పోర్ట్‌లను స్కాన్ చేసి, బయోమెట్రిక్‌లు ప్రామాణీకరిస్తారు. ఐడెంటీ నిర్దారణ పూర్తయిన వెంటనే ఇ-గేట్ ఆటోమేటిక్‌గా తెరుచుకుంటుంది. అంటే, ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ వచ్చినట్టు పరిగణింపబడుతుంది.
ఎలా దరఖాస్తు చేయాలి
అర్హులైన ప్రయాణికులు ఆన్‌లైన్ ద్వారా www.ftittp.mha.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ వివరాలను పూర్తిచేయాలి. వీటిని ఇమ్మిగ్రేషన్ బ్యూరో పరిశీలించి, దరఖాస్తును ఆమోదిస్తుందది. అనంతరం సమీపంలోని విదేశీ ప్రాంతీయ నమోదు కార్యాలయాలు లేదా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో బయోమెట్రిక్స్ తీసుకోడానికి షెడ్యూల్‌ను మొబైల్ ఫ్లోనకు పంపుతారు. ఒక్కసారి నమోదుచేసుకున్న తర్వాత ఐదేళ్ల పాటు లేదా పాస్‌పోర్ట్ కాలపరిమితి ఉన్నంత వరకూ చెల్లుబాటు అవుతుంది.
బయోమెట్రిక్స్ తప్పనిసరి అని, దరఖాస్తు చేసేవారి పాస్‌పోర్ట్ కాలపరిమితి ముగియడానికి కనీసం ఆరు నెలలు ముందైనా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.
ఈ విధానం ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో మానవ జోక్యాన్ని తగ్గిస్తుందని, రెండు దశల్లో దీనిని అమలు చేయనున్నామని పేర్కొన్నారు. మొదటి దశలో భారతీయులు, ఓసీఐ కార్డుదారులకు.. రెండో దశలో విదేశీయులకు అన్వయిస్తామని చెప్పారు.