ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అంశంపై రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు స్పందిస్తున్నాయి. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం స్పందించిన సీఎం చంద్రబాబు దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవో శ్యామలరావును ఆదేశించారు.
అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన టీటీడీ…
ఈ నేపథ్యంలోనే టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులతో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. తిరుమల దేవస్థాన పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. లడ్డూ అపవిత్రం నేపథ్యంలో సంప్రోక్షణ అంశంపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో అదనపు ఈవో వెంకయ్యచౌదరి, ప్రధాన అర్చకుడు, ఆగమ పండితులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మరోవైపు కల్తీ నెయ్యి వివాదంలో టీటీడీ ఈవో నివేదిక కీలకంగా మారనుంది. శనివారం సాయంత్రం ఆయన సీఎం చంద్రబాబును కలవనున్నారు. ఈవో నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుంది. ఈ వ్యవహారంపై ఆగమ, వైదిక శాస్త్ర పండితులతో పాటు ధార్మిక పరిషత్ పెద్దలతో చంద్రబాబు భేటీ కానున్నారు. తిరుమల ఆలయశుద్ధి, సంప్రోక్షణ చేపట్టాలని నిర్ణయం తీసుకోనున్నారు. ధార్మిక పరిషత్ పెద్దల సూచనల మేరకు ముందుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు కల్తీ నెయ్యి వ్యవహారంపై దేవాదాయశాఖ కూడా అప్రమత్తమైంది.