ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రధాని మోడీ వంద రోజుల పాలన ట్రైలర్ మాత్రమేనని బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి వందరోజులు పూర్తి చేసుకుందని అన్నారు. వరుసగా మూడుసార్లు బీసీ వర్గానికి చెందిన మోడీ ప్రధాని పదవిని చేపట్టి రికార్డు సృష్టించారని అన్నారు. బీసీ నేత ఈ రికార్డు నెలకొల్పడాన్ని రాహుల్ గాంధీ, ఆయన కుటుంబం జీర్ణించుకోలేకపోతుందని ఆయన విమర్శించారు. గత వందరోజుల్లోనే చారిత్రక, వికసిత భారత్ దిశగా ప్రధాని మోడీ నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పథకాలు, విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, రోడ్లు, రైల్వేలు, భద్రత, ఇంధనం, సాంకేతికత వంటి అనేక రంగాలలో ప్రాజెక్టులకు మోదీ ప్రభుత్వం గత వంద రోజుల పాలనలో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు.
ఈ మేరకు బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డితో కలిసి ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా వాటిని నెరవేర్చేలా నరేంద్ర మోదీ పాలన అందిస్తుంటే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తూ కాలం వెల్లదీస్తోందంటూ విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణలో గ్యారంటీల పేరుతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను హామీలు అమలు చేయకుండా తీవ్ర అన్యాయం చేసిందని లక్ష్మణ్ మండిపడ్డారు. ప్రధాని మోడీ వంద రోజుల పాలనపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. చర్చకు బీఆర్ఎస్, కాంగ్రెస్ సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు.