- బాధితుల పక్షాన పోరాడేందుకు సిద్ధం
- అండగా ఉండేందుకు లీగల్ టీం
- బాధలు చెబుతుంటే కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు
ముద్ర, తెలంగాణ బ్యూరో :-“ పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకున్నం.. కూలిపోతే తట్టుకునే శక్తి మాకు లేదు.. మా గుండే ఆగిపోతుంది..’’
ఇంటి ముందు చిన్న అలికిడి వినపడ్డా.. గుండె జారీ పోతుంది.. ఏండ్ల నుంచి లక్షలకు లక్షలు వడ్డీలు కట్టాం. సొంత గూడు ఉందని సంబురపడ్డాం. కానీ, ఈ గూడును లాక్కుంటున్నారని హైడ్రా బాధితులు మాజీ మంత్రి హరీశ్ రావు వద్ద తమ గోడును వెల్లబోసుతున్నాకు. హైడ్రా వల్ల తమకు కంటిమీద కునుకు ఉండట్లేదు.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్దం కావట్లేదన్నారు. అసలు మేము కొన్నప్పుడు ఇలాంటివి ఏవీ మాకు తెలియదు. లక్షల కొద్ది బ్యాంకు లోన్లు తెచ్చుకుని మేము ఇళ్లు కట్టుకున్నామన్నారు. అలాంటి ఇళ్ళను ఇప్పుడు హైడ్రా నేలమట్టం చేస్తోంది….దీని వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడతారని ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. మాకు అండగా ఉంటారని మేము బీఆర్ఎస్ భవన్‌కు వచ్చాం. తెల్లారితే అసలు ఏం జరుగుతుందోనని భయంగా ఉందని వ్యాఖ్యానించారు. రేవంత్ సర్కార్ వల్ల మా పిల్లల భవిష్యత్ నాశనం అవుతుందోని వ్యాఖ్యానించారు.
తమ గోడును హైడ్రా ఆఫీసర్ల ముందు ఎంత మొత్తుకున్నా వినేవారు లేరు. కనికరించే వారే లేకుండా పోయారని హరీశ్ రావుకు వివరించారు. ఇటు గాంధీభవన్ కు రానీయడం లేదన్నారు. సచివాలయానికి పోదామంటూ అక్కడా ఆపేస్తున్నారు. ఓ మంత్రి ఏకంగా కేసులు పెడుతామని బెదిరిస్తున్నాడు. తమ బాధను వీడియోలతో పంచుకుంటే.. ఆ వీడియోలను పట్టుకుని కేసు పెడుతామంటున్నారు.. అందుకే మా కన్నీటి వ్యథ చూడండి” అంటూ హరీశ్ రావును బ్రతిమాలాడారు.
ఈ సందర్భంగా రాజేంద్రనగర్‌కు చెందిన ఓ బాధితురాలు మాట్లాడుతూ.. దయచేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకున్నామని, అన్నం కూడా తిన్మామో లేదో తమకే తెలుసని చెప్పారు. ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళనతో క్షణక్షణం భయంతో గడపవలసి వస్తుందన్నారు.గంట గంట.. క్షణ క్షణం బతుకుడు ఎంత కష్టమో తమను చూస్తే తెలుస్తుందని, గొంతులో అన్నం దిగట్లేదని హైడ్రా బాధితులు చెప్పారు. అసలు తాము కొన్నప్పుడు ఇలాంటివి ఏవీ మాకు తెలియదని, తమకు అండగా ఉంటారని తెలంగాణ భవన్‌కు వచ్చామన్నామన్నారు. టీవీ చూస్తుంటే భయం అవుతున్నదని, రాజకీయ నాయకులే తమను మోసం చేస్తే తమ బాధ ఎవరికి చెప్పుకోవాలంటూ వాపోయారు.
గోడు విని.. కన్నీళ్లు పెట్టుకున్న హరీశ్ రావు
తెలంగాణ భవనకు హైడ్రా బాధితులు వచ్చిన విషయం తెలుసుకుని.. మాజీ మంత్రి హరీశ్‌రావు హుటాహుటినా అక్కడకు చేరుకున్నారు. హరీశ్ రావు ముందు బాధితులు ఒక్కసారిగా తమ ఆవేదనను కన్నీళ్ల రూపంలో బయటకు వెళ్లడించారు. ఒక్కొక్కరి బాధ వింటూ ఆయన కూడా కన్నీటి పర్యంతమయ్యారు. బాధితుల బాధలు వింటూ కంట నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు తమ ఇండ్ల గురించి వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే తమకు నిర్మాణానికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఇచ్చారని, ఇప్పుడు కూల్చేస్తామనడం సరికాదన్నారు. అప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అని ప్రశ్నించారు. ఇప్పుడు అసలు ప్రభుత్వం తరఫున ఎలాంటి సమాచారం ఉండడం లేదని, అధికారులతో మాట్లాడిన కూడా స్పందన కరువైందని వాపోయారు. బీఆర్ఎస్ నేతలను కలిసి తమ గోడును వెళ్లబోసుకునేందుకు వచ్చామని తెలిపారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడితే, తమ సొంత జీతాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కానీ, ఇలా అక్రమంగా ఇళ్లు కూల్చేయడం సరికాదని మండిపడ్డారు.
ఎవరిని కదిలించినా హైడ్రా
‘‘హైడ్రా’’.. ఇప్పుడు ఇదే తెలంగాణలో పెద్ద హాట్‌టాపిక్. ఎప్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఉన్న అక్రమ ఇళ్ల నిర్మాణాలు కూల్చివేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది హైడ్రా. ఏ రోజు, ఏ క్షణం హైడ్రా సిబ్బంది వచ్చి తమ ఇళ్లను కూల్చివేస్తారేమో అని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితుల్లో బాధితులు ఉన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు కొనసాగిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అనేక అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. ఎంతో కష్టపడి, కాయా కష్టం చేసుకుంటూ, బ్యాంకు లోన్లు తీసుకుని ఇళ్లు కట్టుకున్నామని.. ఒక్కసారికిగా హైడ్రా వచ్చి ఇవి అక్రమ నిర్మాణాలు అంటూ కూల్చివేస్తే తమ పరిస్థితి ఏంటి అంటూ హైడ్రా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.