భారత పేసర్లతో పోలిస్తే తమ పేసర్లకు తగినంత అనుభవం లేదని ఒప్పుకున్న షంటో.. కానీ అనుభవం ఉన్న తమ స్పిన్నర్లు భారత బ్యాటర్లను ఇబ్బంది పెడతారన్నాడు. తమ స్పిన్నర్లు ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలింగ్ చేయగలరన్న బంగ్లా కెప్టెన్.. పేసర్లు, స్పిన్నర్లు లేదా బ్యాటర్లు.. ఇలా తమ ఆటగాళ్లెవరైనా నూరు శాతం ప్రదర్శన ఇస్తారన్నాడు. తాము ఓ జట్టుగా ఆడినప్పుడు కచ్చితంగా తేడా కనిపిస్తుందన్నాడు.
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న రెండు టెస్టుల సిరీస్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో భాగం. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 68.52 శాతం పాయింట్లతో భారత్ ప్రస్తుతానికి అగ్రస్థానంలో ఉంది. పాకిస్థాన్‌పై అనూహ్య రీతిలో టెస్టు సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్ 45.83 పర్సంటేజ్ పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. చివరగా 2019లో భారత గడ్డ మీద టెస్టు సిరీస్ ఆడిన బంగ్లాదేశ్ వైట్ వాష్‌కు గురైంది.
బంగ్లాదేశ్ జట్టు భారత్‌తో టెస్టు సిరీస్ కోసం సన్నద్ధం అవుతోన్న వేళ.. ఈ సిరీస్‌ను క్యాన్సిల్ చేయాలనే డిమాండ్ మొదలైంది. బంగ్లాదేశ్‌లో హిందువులు హింసకు గురవుతున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ జట్టుతో టెస్టు సిరీస్ ఆడటం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బీసీసీఐ కేవలం డబ్బు కోణంలో మాత్రమే చూడొద్దని హితవు పలుకుతున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసకు పాల్పడుతున్న వేళ.. బంగ్లాదేశ్‌తో క్రికెట్ ఆడొద్దని డిమాండ్ చేస్తూ దేశంలో పలు చోట్ల రోడ్ల మీదకు వస్తున్నారు.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.