బస్సులో 12 ఏళ్ల విద్యార్థికి గుండె నొప్పి.. కండక్టర్, డ్రైవర్ చేసిన పనికి హ్యాట్సాఫ్, సన్మానించిన సజ్జనార్

By Margam

Published on:

Follow Us
బస్సులో 12 ఏళ్ల విద్యార్థికి గుండె నొప్పి.. కండక్టర్, డ్రైవర్ చేసిన పనికి హ్యాట్సాఫ్, సన్మానించిన సజ్జనార్


Telegram Channel Join Now
బస్సులో 12 ఏళ్ల ఓ విద్యార్థి గుండె నొప్పితో విలవిల్లాడాడు. కండక్టర్, డ్రైవర్ సమయస్ఫూర్తితో స్పందించి అతడి ప్రాణాలు కాపాడారు. విద్యార్థికి ప్రథమ చికిత్స అందించడంతో పాటు అదే బస్సులో హుటాహుటిన ఆస్పత్రికి తరలించి సకాలంలో చికిత్స అందేలా చేశారు. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమయస్ఫూర్తితో స్పందించి విద్యార్థికి స‌కాలంలో వైద్య సాయం అందించిన కండక్టర్, డ్రైవర్‌ను టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సన్మానించారు. న‌గ‌దు బ‌హుమ‌తులు సైతం అంద‌జేశారు.భైంసా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం (సెప్టెంబర్ 9) భైంసా నుంచి నిర్మల్‌కు బయల్దేరింది. మార్గమధ్యంలో దిలావ‌ర్‌పూర్ వ‌ద్దకు రాగానే బస్సులో ప్రయాణిస్తున్న 12 ఏళ్ల విద్యార్థి కిర‌ణ్‌కు ఒక్కసారిగా గుండె నొప్పితో విలవిల్లాడాడు. అది గ‌మ‌నించిన కండ‌క్టర్ జి. గంగాధ‌ర్.. డ్రైవర్‌ను అప్రమత్తం చేశాడు. దీంతో డ్రైవర్ బి. గంగాధర్‌ బ‌స్సును రోడ్డు ప‌క్కన నిలిపివేశారు. బాలుడికి వెంటనే ప్రాథ‌మిక చికిత్స అందించారు.

కిరణ్ ఆరోగ్యప‌రిస్థితి విష‌మించ‌డంతో అతడిని అదే బ‌స్సులో స‌మీపంలోని న‌ర్సాపూర్ పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ వైద్య సిబ్బంది అతడికి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. విద్యార్థిని సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రాణాలు నిలిచాయని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. విద్యార్థి ప్రాణాల‌ను కాపాడిన డ్రైవ‌ర్, కండక్టర్లను అభినందించారు. బుధవారం వారిని హైదరాబాద్‌లోని బస్ భవన్ కార్యాలయంలో సన్మానించారు.

‘ఆపద సమయంలో ఆర్టీసీ సిబ్బంది సేవా భావం కలిగిఉండటం గొప్ప విషయం. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడం మాత్రమే కాదు, వారికి ఆపద సమయంలో మేము అండగా ఉన్నామని భరోసా కల్పిస్తుండటం అభినందనీయం’ అని సజ్జనార్ పేర్కొన్నారు.

కండ‌క్టర్ జి. గంగాధ‌ర్‌, బస్సు డ్రైవ‌ర్ బి.గంగాధ‌ర్‌లను సజ్జనార్‌‌తో పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులతో సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో టీజీఎస్ ఆర్టీసీ సంస్థ సీవోవో డాక్టర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్, ఫైనాన్స్ అడ్వైజర్ విజ‌య‌పుష్ఫ, చీఫ్ ట్రాఫిక్ మేనేజ‌ర్ శ్రీదేవి, చీఫ్ ప‌ర్సన‌ల్ మేనేజ‌ర్ ఉషాదేవి, బైంసా డిపో మేనేజ‌ర్ హ‌రిప్రసాద్, త‌దితరులు పాల్గొన్నారు.

Source link

Leave a Comment