ఇక నుంచి.. ఎయిర్ పోర్ట్‌కు వెళ్లే పుష్పక్ బస్సు టికెట్ ధరల్లో భారీ డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బస్సుల్లో చాలా మంది ప్రయాణికులు వెళ్తుంటారు. ఆ ప్రయాణికుల కోసం.. ఇక నుంచి పుష్పక్ బస్సుల్లోని టికెట్ ధరల్లో 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది. అయితే.. ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది కలిసి.. ఎయిర్ పోర్ట్‌కు పుష్పక్ బస్సుల్లో ప్రయాణం చేస్తే అలాంటి గ్రూప్‌కి అదనంగా మరో 10 శాతం కలిపి మొత్తం 20 శాతం డిస్కౌంట్‌ను అందించనున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది.
అయితే.. ఈ బంపర్ ఆఫర్ కేవలం సిటీ నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రయాణికులకు మాత్రమే వర్తింపజేయనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది. ఇక ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను వినియోగించుకొని పుష్పక్ బస్సుల్లో క్షేమంగా ఎయిర్ పోర్ట్‌కు చేరుకోవాలని సంస్థ యాజమాన్యం కోరుతోంది. ఈ డిస్కౌంట్‌కు సంబంధించిన సమాచారాన్ని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఎయిర్ పోర్ట్ వెళ్లే పుష్పక్ బస్సుల్లో క్యాష్ లెస్ పేమెంట్స్ చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది టీజీఎస్ ఆర్టీసీ. అంటే.. డైరెక్టుగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐలతో పేమెంట్ చేసి.. టికెట్ పొందే సౌకర్యాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ సౌకర్యం.. కేవలం ఎయిర్ పోర్ట్ వెళ్లే పుష్పక్ బస్సుల్లోనే కాదు.. మిగతా మార్గాల్లో సేవలందిస్తోన్న పుష్పక్ బస్సులతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సులు, నాన్ స్టాప్ బస్సుల్లో కూడా తీసుకొచ్చింది. అయితే.. ఈ విధానంలో చిల్లర సమస్యకు చెక్ పెట్టిన టీజీఎస్ ఆర్టీసీ.. ఇదే విధానాన్ని గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తోన్న పల్లె వెలుగు బస్సుల్లోనూ అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది టీజీఎస్ ఆర్టీసీ.