- గతంలో వినేవారు లేరు.. మేం వినేందుకు సిద్ధంగా ఉన్నాం
- మంత్రులతో ముఖాముఖిపై ప్రజలు, కార్యకర్తలు భరోసా పెట్టుకున్నారు
- తొలి రోజు 285 దరఖాస్తులు..!
- తక్షణమే 30 సమస్యల పరిష్కారం
- జిఓ 317 బాధితులు, భూ వివాదం, అక్రమ కేసులు,ఉద్యోగాల కోసం ఎక్కువ ఆర్జీలు
- గాంధీభవన్ లో మంత్రులతో ముఖాముఖిలో పీసీసీ చీఫ్, మంత్రి దామోదర
ముద్ర, తెలంగాణ బ్యూరో : గాంధీభవన్ వేదికగా జరుగుతున్న మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంపై రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులు ఎంతో భరోసా పెట్టుకున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల కష్టాసుఖాలు వినేవారు లేరన్న ఆయన కాంగ్రెస్ ప్రజాపాలనలో తాము అందరి సమస్యలు వినేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మంత్రులతో ముఖాముఖిలో వచ్చే ప్రతి ఫిర్యాదుపై స్పందిస్తామని వెల్లడించారు. బుధవారం గాంధీభవన్ లో ప్రారంభమైన మంత్రులతో ముఖాముఖి తొలి కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఆయన ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు, కార్యకర్తలు ఇచ్చిన అర్జీలను మంత్రులు తీసుకొని సంబంధిత శాఖల అధికారులతో పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ముఖాముఖి కార్యక్రమం ఒక నిరంతర ప్రక్రియ అన్న మహేశ్ కుమార్ గౌడ్ ప్రజలు ప్రశాంతంగా ఉండి సమస్యలు పరిష్కారం చూసుకోవాలన్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ముఖాముఖి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సంబంధిత శాఖలకు తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కి ప్రభుత్వానికి ఈ కార్యక్రమం ద్వారా మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తొలిసారిగా నిర్వహించిన కార్యక్రమంలో 285కు పైగా అప్లికేషన్లు వచ్చాయన్న మంత్రి వాటిలో ఆరోగ్యసమస్యలు, జిఓ 317 బాధితులు, భూ వివాదం, అక్రమ కేసులు, బదిలీలు అంటూ, ఉద్యోగాలు, వైద్య సేవల వంటి ఫిర్యాదులు అందాయన్నారు. వాటిలో గాంధీ, ఉస్మానియా, పోలీస్ స్టేషన్లకు చెందిన 30 అర్జీలను వెంటనే పరిష్కరించినట్లు మంత్రి వెల్లడించారు. కాగా తమ గోడును వెల్లబోసుకునేందుకు వచ్చిన మహిళలు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు, తల్లులు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకున్నామన్నారు. డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యక్షులు కుమార్ రావ్, ఫిషెరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, అధికార ప్రతినిధులు భవాని రెడ్డి, బండారు శ్రీకాంత్, అల్లం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.