- 1,350 మంది మూసీ నిర్వాసితులకు హైడ్రా నోటీసులు
- 28, 29 తేదీల్లో కూల్చివేతలు
- రంగంలో మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు
- నిర్వాసితులను ఒప్పించేలా వారితో చర్చలు
- నగరశివారులో కొనసాగుతోన్న హైడ్రా కూల్చివేతలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక మూసి రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ లో కీలక ముందడుగు పడింది. ఆ నదిని ప్రక్షాళన చేసి పరిసర ప్రాంతాలను సుందరీకరించడం ద్వారా విదేశీ పర్యటకులూ సందర్శించేలా ప్రణాళికలు రూపొందిస్తున్న రాష్ట్ర సర్కార్..ముందుగా క్షేత్రస్ధాయిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి వడివడిగా అడుగులేస్తున్నది. కాగా ఇప్పటికే అక్కడ నిర్మాణాలు కూల్చేందుకు వెళ్లిన హైడ్రా అధికారులను అడ్డుకున్న స్ధానికులు తమకు పునరావాసం కల్పించిన తర్వాతే తమ నివాసాలు కూల్చాలని డిమాండ్ చేశారు. అయితే ఏకకాలంలో వందలాది మంది ఆశ్రయం కోల్పోతారని భావించిన సర్కార్..మూసీ పరివాహన ప్రాంతంలో నివసించే కుటుంబాలను లెక్క వేసేందుకు సర్వే నిర్వహించింది. ఈ మేరకు అక్కడ 1,350 కుటుంబాలు నివసిస్తున్నట్లు సర్వే అధికారులు తేల్చారు. మరోవైపు… ఇప్పటికే వారందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నెల 24న 16,200 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేసింది. మరోవైపు మరుసటి రోజే రంగంలో దిగిన హైడ్రా అధికారులు బుధవారం నిర్వాసితులందరికీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28, 29 తేదీల్లో అక్కడున్న నిర్మాణాలు కూల్చివేస్తామని ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది. అయితే నిర్వాసితులు మాత్రం తమకు ఇళ్లు కేటాయించిన తర్వాతే ఇక్కడ్నుంచి కదలుతామని స్పష్టం చేశారు. అప్పటి వరకు కదిలేది లేదని భీష్మించుకున్నారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతాలున్న మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లను రంగంలో దింపింది. క్షేత్రస్ధాయిలో పర్యటించిన మూసీ నిర్వాసితులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామనే భరోసా కల్పించాలని, ఆ ప్రక్రియ తుది దశలో ఉందనే విషయాన్ని వివరించాలని సూచించింది. దీంతో రంగంలో దిగిన ఆయా జిల్లాల కలెక్టర్లు వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.
అమీన్ పూర్ లో హైడ్రా దూకుడు..!
అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి ఎన్ని ఆరోపణలు, విమర్శలు వెలువెత్తుతోన్నా హైడ్రా ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ మేరకు బుధవారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పెద్దచెరువును హైడ్రా అధికారులు రీసర్వే చేశారు. గతంలో ఇక్కడ అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా అధికారులు.. గోల్డెన్ కీ, వాణీనగర్, హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ, వెంకటరమణ కాలనీలో రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో నవ్య చౌరస్తాలో అక్రమంగా కట్టిన భవనాన్ని కూల్చివేశారు.
ఫిర్యాదులతో రంగంలో హూడ్రా..!
పెద్దచెరువు కబ్జా చేసి ఎఫ్‌టీఎల్ పరిధిలో ఇళ్లు కట్టారని హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో, చెరువు పరిధిలోని పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇదే ప్రాంతంలో నిర్మాణాలు కూల్చి మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. అలాగే అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడలో ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి వాణిజ్య కార్యకలాపాల కోసం భవనాలను నిర్మించినట్లు హైడ్రా గుర్తించింది. కిష్టారెడ్డిపేటలో సర్వే నెంబర్ 164లో వాణిజ్యపరంగా నిర్వహిస్తున్న 3 ఐదంతస్తుల భవనాలను కూల్చివేశామని, అక్కడ ఎకరం ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వివరించింది. పటేల్‌గూడలోని సర్వే నెంబర్ 12/2, 12/3లోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి 25 నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని హైడ్రా గుర్తించింది. వాటిని తొలగించి 3 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని 51 ఎకరాల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా వెంచర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అలాగే రోడ్లను సైతం ఆక్రమిస్తూ పద్మావతి నగర్లో ఏర్పాటు చేసిన అక్రమ లేవుట్‌కు సంబంధించిన ప్రహరీ గోడతో పాటు రెండు సెక్యూరిటీ గదులను హైడ్రా అధికారులు తొలగించారు. అమీన్‌పూర్‌లో ఓప్రైవేట్ పాఠశాల యాజమాన్యం కబ్జా చేసి నిర్మించిన ప్రహరీ, ఆట స్థలాన్ని హైడ్రా నేలమట్టం చేసింది. ప్రొక్లెయిన్ సాయంతో ప్రహరీని కూల్చి దాదాపు 15 గుంటల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. సర్వే నెంబర్ 462లో 38 గుంటల ప్రభుత్వ భూమిలో వెలసిన దుకాణాలను తొలగించారు. ఆ దుకాణాలు స్థానిక మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డివిగా గుర్తించిన అధికారులు అతనిపై చర్యలకు ఉపక్రమించారు.