- ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి క్షమాపణ చెప్పాలి
- ప్రజలను బ్లాక్ మెయిల్ చేసిన చరిత్ర నీది
- వెలిచాల రాజేందర్ రావు
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :బతకడానికి వచ్చినవ్ నీవేంది అంటూ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని కించపరిచిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు డిమాండ్ చేశారు. పాడి కౌశిక్ నీ రౌడీయిజం నీ దగ్గర పెట్టుకోవాలని.. ఖబర్దార్.. ఎవరిని పడితే వారిపై పిచ్చి కూతలు కూస్తే నీ అంతు చూస్తామని హెచ్చరించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు.
గురువారం కరీంనగర్లో వెలిచాల రాజేందర్ రావు విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే అరికెపుడి గాంధీపై పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీకి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేకపోతే, బీఆర్ఎస్ పార్టీ నుంచి పాడిని సస్పెండ్ చేయాలని సూచించారు. అరికెపూడి గాంధీని బతకడానికి వచ్చినవని నీవే స్వతహాగా వాక్యాలు చేశావా.. లేకుంటే కెసిఆర్ వెనక ఉండి నిన్ను మాట్లాడించారా.. ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బతకడానికి వచ్చిన వారు ఓట్లు వేస్తేనే హైదరాబాదులో బిఆర్ఎస్ కు సీట్లు వచ్చాయని, అలాంటప్పుడు కించపరిచినట్లు మాట్లాడితే ఇది ఎంత వరకు కరెక్ట్ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు చీరెలు, గాజులు పంపిస్తున్నానని ఫోటోలకు ఫోజులు ఇచ్చిన పాడి కౌశిక్ రెడ్డి మహిళా మణులంటే అంత చులకన భావం ఎందుకని మండిపడ్డారు. సమాజంలో మహిళలకు ఉన్నతమైన గౌరవం ఉందని, అలాంటి వారిని కించపరచడం నీచ సంస్కృతి కాదా? అని ప్రశ్నించారు. మహిళలను కించపరిచిన మీకు వారు బడితే పూజ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జాగ్రత్తగా ఉండాలని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.
కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు నడిపిస్తున్న రాజకీయ పావులో బలి కాకుండా చూసుకోవాలని హితవు పలికారు. ఇకనైనా చిల్లర మల్లరగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యేలపై మాట్లాడడం బంద్ చేయాలని హెచ్చరించారు. పాడి కౌశిక్ నీ వైఖరి మార్చుకోకపోతే మాత్రం నీ అంతు చూడడం ఖాయమని వెలిచాల రాజేందర్ రావు వార్నింగ్ ఇచ్చారు.