పశ్చిమాసియాలో ఉద్రిక్తత.. ఆ ప్రాంతం మీదుగా భారత్‌కు వచ్చే విమానాలపై కీలక నిర్ణయం

By Margam

Published on:

Follow Us
పశ్చిమాసియాలో ఉద్రిక్తత.. ఆ ప్రాంతం మీదుగా భారత్‌కు వచ్చే విమానాలపై కీలక నిర్ణయం



Telegram Channel Join Now
పశ్చిమాసియా నిప్పుల కుంపటిగా మారింది. ప్రాంతీయ యుద్ధం అంచున నిలిచింది. హెజ్బొల్లా, హమాస్‌ అగ్రనేతలను మట్టుబెట్టిన ఇజ్రాయేల్‌పై ఇరాన్‌ క్షిపణులతో దాడికి దిగింది. టెల్‌అవీవ్, జెరూసలెం లక్ష్యంగా మంగళవారం రాత్రి ఒకేసారి 180 క్షిపణుల్ని ప్రయోగించింది. లెబనాన్‌లో భూతల దాడులు ప్రారంభించినట్టు ఇజ్రాయేల్‌ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్‌ క్షిపణుల ప్రయోగించడం గమనార్హం. తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం మీదుగా ప్రయాణించే విమానాలను పలు విమానయాన సంస్థలు దారిమళ్లిస్తున్నాయి.ఉద్రిక్తతల కారణంగా ఇరాన్, ఇజ్రాయేల్, జోర్డాన్ మీదుగా విమానాలను నడపరాదని నిర్ణయించాయి. సంఘర్షణ మరింత తీవ్రతరం కావడంతో ఈ ప్రాంతం మీదుగా సర్వీసులు నడిపే విమానయాన సంస్థలు భద్రత కోసం గాలిస్తున్నాయి. భద్రతా కారణాల రీత్యా జర్మనీ నుంచి భారత్‌కు రావాల్సిన విమానాలను లుఫ్తాన్స్ ఎయిర్‌లైన్స్ ఆ ప్రాంతం మీదుగా నడపరాదని మంగళవారం నిర్ణయించింది. ఇజ్రాయేల్‌పై ఇరాన్ క్షిపణి దాడులతో మంగళవారం ఫ్రాంక్‌ఫర్ట్-హైదరాబాద్, ఫ్రాంక్‌ఫర్ట్-ముంబయి విమానాలను టర్కీ మీదుగా మళ్లించింది. ఇరాన్, ఇజ్రాయేల్ గగనతలం మీదుగా భారత్ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు బుధవారం ఉదయం బయలుదేరాల్సిన విమానాలను రద్దు చేశారు. స్విస్ ఎయిర్‌లైన్స్ సైతం ఆ ప్రాంతం మీదుగా విమానాలను నడపరాదని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘దుబాయ్, భారత్, ఆగ్నేయాసియా విమాన సర్వీసుల్లో అదనంగా 15 నిమిషాల వరకు సమయం పెరుగుతుంది.. అక్టోబరు 31 వరకూ ఇజ్రాయేల్, లెబనాన్ గగనతలం మీదుగా వెళ్లే విమానాలను దారి మళ్లించాం’ అని ఆ ప్రకటనలో తెలిపింది. మంగళవారం జ్యూరిచ్ నుంచి బయలుదేరిన దుబాయ్ విమానం ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం రావడంతో టర్కీలోని అంటాల్యకు మళ్లించారు. అంటాల్యలో ఇంధనం నింపుకుని, దుబాయ్‌కి ప్రయాణాన్ని కొనసాగించింది. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ అధికారి ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ప్రస్తుత భద్రతా పరిస్థితుల కారణంగా మేము ఇకపై ఇరాక్, ఇరాన్, జోర్డాన్ గగనతలం గుండా ప్రయాణించడం లేదు’ అని పేర్కొన్నారు. అలాగే, ఎయిర్ ఇండియా అధికారి ఒకరు ‘పశ్చిమాసియా లేదా ఇతర మార్గంలో ప్రయాణించే మా అన్ని విమానాలు భద్రత లేదా భద్రతా ముప్పుపై ప్రతిరోజూ అంచనా వేస్తాం.. కార్యకలాపాలకు ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలను నివారించడానికి అవసరమైతే సర్దుబాట్లు చేస్తాం’ అని చెప్పారు.కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ ఇటువంటి పరిస్థితే ఏదురయ్యింది. పశ్చిమాసియా మీదుగా ప్రయాణించే విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జీపీఎస్ వ్యవస్థ జామ్ కావడంతో విమానాలు నడిపే పైలట్లు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.

Source link

Leave a Comment