తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్‌న్యూస్.. తిరుపతి వెళ్లే రైలును రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. తిరుపతి-శ్రీకాకుళంరోడ్-తిరుపతి ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కే సందీప్ తెలిపారు. నిర్వహణ పరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబరు 6 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు తిరుపతి-శ్రీకాకుళంరోడ్ (07440) ప్రత్యేక రైలును రద్దు చేశారు.. అలాగే అక్టోబరు 7 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు శ్రీకాకుళంరోడ్-తిరుపతి(07441) ప్రత్యేక రైలును రద్దు చేసినట్లు తెలిపారు.అలాగే వాల్తేరు డివిజన్ పరిధిలో పలు రైళ్ల గమ్య స్థానాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం సందీప్ ఓ ప్రకటనలో తెలియజేశారు. కేకేలైనులో బచేలి-కిరండూల్ మార్గంలో భారీ వర్షాలు పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈనెల 12 నుంచి 18 వరకు విశాఖ-కిరండూల్ (08551) ప్యాసింజర్, విశాఖ-కిరండూల్(18514) రాత్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లు దంతెవాడ వరకు నడుస్తాయి. ఈ రైళ్లు (కిరండూల్-విశాఖ(08552) ప్యాసింజర్, కిరండూల్-విశాఖ(18513) రాత్రి ఎక్స్‌ప్రెస్) తిరుగు ప్రయాణంలో ఈనెల 13 నుంచి 19 వరకు దంతెవాడ నుంచి బయలుదేరుతాయి. ఆయా రోజుల్లో కిరండూల్-దంతెవాడ మధ్య రైళ్ల ప్రయాణం రద్దు చేశారు. ప్రయాణికులు రైళ్ల రద్దు విషయాన్ని గమనించి అందుకు తగిన విదంగా జర్నీ ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
మరోవైపు దసరా, దీపావళి పండుగలు ఉండటంతో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా తిరుపతి–శ్రీకాకుళం రోడ్డు మధ్య స్పెషల్ వీకెండ్ రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. తిరుపతి–శ్రీకాకుళం రోడ్డు (07442) రైలు అక్టోబర్ 6 నుంచి నవంబర్ 10 వరకు ప్రతి ఆదివారం నడవనుంది. అక్టోబర్ 7 నుంచి నవంబర్ 11 వరకు శ్రీకాకుళం రోడ్డు–తిరుపతి (07443) రైలు ప్రతి సోమవారం నడవనుంది. ఈ రైలు రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్‌లలో ఆగుతుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు తెలిపారు.