తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి కల్తీ జరిగిందని టీటీడీ గుర్తించింది. గతంలో ఏఆర్ డెయిరీ పంపించిన నెయ్యిలో కల్తీ చేశారని టెస్టుల్లో గుర్తించారు.. వెంటనే ఆ నెయ్యి లారీలను వెనక్కు పంపించారు. వెంటనే టీటీడీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.. మళ్లీ కర్ణాటక నందిని డెయిరీ నుంచి నెయ్యిని తెప్పిస్తోంది. అప్పటి నుంచి తిరుమల లడ్డూ ప్రసాదంలో నాణ్యత పెరిగిందని చెబుతున్నారు టీటీడీ ఈవో జే శ్యామలరావు. అలాగే ప్రసాదాల్లో ఉపయోగించే సరుకుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. నాణ్యతలేని వాటిని వెనక్కు పంపించారు. అలాగే తిరుమలలో అన్నప్రసాదాల విషయంలో టీటీడీ జాగ్రత్తలు తీసుకోవడంతో నాణ్యత పెరిగింది.
అంతేకాదు టీటీడీ తిరుమలలో మహాశాంతి హోమం కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు.. ఈ నెల 23న తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి దగ్గర యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను నిర్వహించారు. హోమం అనంతరం టీటీడీ సంప్రోక్షణ కూడా నిర్వహించింది. ప్రధానంగా రుత్వికులు వాస్తు శుద్ధి, కుంభజాల సంప్రోక్షణ చేశారు. ఈ హోమం, సంప్రోక్షణ తర్వాత భక్తులు లడ్డూ ప్రసాదం, నైవేద్యం నాణ్యతపై తమకున్న ఆందోళన, భయాలు, అపోహలను పోయినట్లే అంటున్నారు. యాగశాలలో సంకల్పం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, వాస్తు హోమం, కుంభప్రతిష్ట, పంచగవ్య ఆరాధన వంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమలలో పూర్ణాహుతి అనంతరం కుంభ ప్రోక్షణ నిర్వహించి విశేష నైవేద్యం కూడా సమర్పించారు. ఇక నుంచి లడ్డూ ప్రసాదాలు, నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని, భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చని చెప్పారు ఈవో, ఆలయ అర్చుకులు.