దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తగినంత స్టాక్ ఉండటం, ప్రతికూల మార్జిన్ల కారణంగా ఆగస్టులో భారతదేశ పామాయిల్ దిగుమతులు తగ్గినట్లు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) పేర్కొంది. ప్రపంచంలోని అతిపెద్ద పామాయిల్ (కూరగాయల నూనెల) దిగుమతిదారు అయిన భారత్, కీలక ఉత్పత్తిదారులైన ఇండోనేషియా, మలేషియా నుంచి తక్కువ కొనుగోళ్లను జరపడంతో ఆయా దేశాల్లో అధిక స్థాయిలో నిల్వలు పేరుకుపోయాయి. మొత్తం పామాయిల్ దిగుమతులు జులై నుంచి ఆగస్టులో 26 శాతం పడిపోయి 797,482 మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయని SEA ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదే సమయంలో సోయాయిల్ దిగుమతులు 16 శాతం పెరిగి 4,54,639 టన్నులకు చేరుకోగా, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు 22.5 శాతం తగ్గి 2,84,108 టన్నులకు చేరుకున్నాయి. పామ్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ల దిగుమతులు తగ్గడం వల్ల దేశం మొత్తం ఎడిబుల్ ఆయిల్ దిగుమతులు 17 శాతం తగ్గి 1.53 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. పామాయిల్ ధర సోయాయిల్‌తో పోల్చితే ఎక్కువగా ఉండటం కారణంగా రిఫైనర్లు పామాయిల్ నుండి సోయాయిల్‌కి మారుతున్నారు.
సెప్టెంబరులో సోయాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను తక్కువ కొనుగోలు చేయడం వల్ల ఎడిబుల్ ఆయిల్ దిగుమతులు తగ్గవచ్చని GGN రీసెర్చ్ మేనేజింగ్ పార్ట్‌నర్ రాజేష్ పటేల్ అంచనా వేశారు. అదే సమయంలో పామాయిల్ దిగుమతులు స్వల్పంగా 8,00,000 టన్నులకు పెరగవచ్చని అన్నారు. భారత్ ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుండి పామాయిల్ కొనుగోలు చేస్తుంది. అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుండి సోయాయిల్, సన్‌ఫ్లవర్ నూనెను దిగుమతి చేసుకుంటుంది .