మరోవైపు టీడీపీ కూడా ఈ పోస్టులు, ట్వీట్‌లపై స్పందించింది. ‘టీటీడీ చైర్మన్‌గా ఎంపికైన బీఆర్ నాయుడు గారి ఫోటోలను మార్ఫింగ్ చేసి, ప్రముఖుల పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టించి, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. దీని వెనుక వైసిపి కిరాయి మూకలున్నాయని ఆధారాలు లభించాయి. ఫేక్ అకౌంట్ ఫేక్ ఫెలోస్‌కి ఇన్ ఫ్రంట్ క్రోకోడైల్ ఫెస్టివల్’అంటూ ట్వీట్ చేసింది.
టీటీడీ పాలకమండలి ఛైర్మన్ పదవి దక్కడం ఆనందంగా ఉందన్నారు బీఆర్ నాయుడు. పదవి రావడం అదృష్టంగా భావిస్తున్నానని.. తనను ఈ పదవిలో నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎన్డీయే పెద్దలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తానని.. టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నాక మళ్లీ సీఎంను కలిసి ఆయన సలహాలతో ముందుకెళ్తానన్నారు. తాను చిత్తూరు జిల్లాలోనే పుట్టి పెరిగానని.. చిన్నతనం నుంచి తిరుమలకు తప్ప మరో ఆలయానికి వెళ్లలేదన్నారు. గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా వెళ్లలేదని చాలా బాధపడ్డానన్నారు. కానీ తాను గతంలో ఏడాదికి ఐదారుసార్లు వెళ్లేవాళ్లమన్నారు.. అలాంటిది గత ఐదేళ్లూ వెళ్లలేదంటే తమ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు.
తాను ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటానని.. ఎంతోమంది స్వామీజీలతోనూ పరిచయాలున్నాయన్నారు బీఆర్ నాయుడు. తాను హిందూ ధర్మం ఛానల్ కూడా ఏర్పాటు చేశానని గుర్తు చేశారు.. సొంత డబ్బుతో తిరుమలకు సేవ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి విషయాన్నీ బోర్డు మీటింగ్‌లో చర్చించి నిర్ణయాలు జరుగుతాయని.. శ్రీవారికి సేవ చేయాలనే ఆలోచనతోనే వచ్చాను అన్నారు. తనపై విమర్శలు, ఆరోపణలు చేసేవారికి ఎలా సమాధానం చెప్పాలో తెలుసన్నారు. తాను జీవితంలో తప్పు చేయలేదని.. తప్పుడు వార్తలు రాస్తే కోర్టుకెళ్తానన్నారు.
తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం గంటలో పూర్తికావాలనేది తన ఆలోచన అన్నారు బీఆర్ నాయుడు. తిరుమలలో భక్తులను ఎక్కువసేపు కంపార్టుమెంట్లలో ఉంచడం సరికాదని.. చిన్నపిల్లలను అలా ఎక్కువ సమయం ఉంటే ఇబ్బందులు ఉంటాయన్నారు. గత ఐదేళ్లలో కంపార్టమెంట్లలో పిల్లలకు పాలు కూడా ఇవ్వలేదన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే పాలు, అల్పాహారం అందిస్తున్నారని చెప్పారు. శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలనే ఆలోచన ఉందని.. ఒక పెద్ద ట్రస్టు ఉన్నప్పుడు మరో ట్రస్టు ఎందుకు? అని ప్రశ్నించారు. దర్శన టికెట్ల విషయంలో కొన్ని ఆలోచనలు ఉన్నాయని.. గతంలో ఉన్న టైమ్ స్లాట్ పద్ధతిని మళ్లీ తీసుకొస్తామన్నారు. మరికొన్ని మంచి ఆలోచనలు ఉన్నాయని.. వాటిని బోర్డులో చర్చించి అమలు చేస్తామన్నారు.