ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను జీడీపీ ద్వారా లెక్కిస్తారు. ఇది ఒక దేశంలోని కంపెనీలు, ప్రభుత్వాలు, వ్యక్తుల ఆర్థిక కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకుంటుంది. జీడీపీ గణాంకాలు ఎంత ఎక్కువగా ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ అంత బలంగా ఉన్నట్టు, అన్ని రంగాలు అంతగా ముందుకు వెళ్తున్నట్టు అందరూ భావిస్తారు. అయితే దేశ ప్రగతికి జీడీపీ ఒక్కటే పూర్తి కొలమానంగా భావించలేం. జీడీపీ ఇండికేటర్ అనేది సామాన్య ప్రజల జీవితాలను పూర్తిస్థాయిలో ప్రతిబింబించదు. జీడీపీ వృద్ధి చెందుతుందంటే దాని వల్ల సామాన్య ప్రజలకు అనేక రకాలుగా సౌలభ్యం ఏర్పడుతుందని, వారు ఆనందంగా ఉంటున్నారని చెప్పలేం. జీడీపీ అనేది దేశ సగటు ప్రగతిని చూపిస్తుందే తప్ప సంపద పంపిణీ ఎలా జరుగుతుందో చెప్పదు. జీడీపీ ఫ్యాక్ట్స్పై మహమ్మద్ ఆరిఫ్ ప్రత్యేక కథనం.
లెక్కింపు ప్రామాణికతపై అనేక అనుమానాలు
జీడీపీ లెక్కింపు ప్రక్రియ ప్రామాణికతపై అనేక అనుమానాలు ఉన్నాయి. మార్కెటేతర కార్యకలాపాలు, సెకండ్ హ్యాండ్ వస్తువుల అమ్మకాలు, ఇంకా అనేక రకాల కార్యకలాపాలు జీడీపీలో ఉండవు. రిజిస్టర్ట్ మార్కెట్లకు రాని వ్యవసాయ ఉత్పత్తులు అందులోకి రావు. జీడీపీని లెక్కించాలంటే వినిమయ వ్యయం, ప్రభుత్వ వ్యయం, పెట్టుబడి వ్యయం, నికర ఎగుమతులను లెక్కలోకి తీసుకుంటారు. అత్యధిక శాతమున్న అసంఘటిత రంగాన్ని ఇందులో లెక్కలోకి తీసుకోరు. ఇంకా చాలా రంగాలు జీడీపీ గణాంకాల్లో ప్రతిఫలించవు. దీంతో జీడీపీ పెరిగినా ఖర్చు చేయగలిగే ఆదాయం పడిపోవచ్చు. ప్రజల జీవితాలతో సంబంధం లేకుండా సంపద సృష్టి జరగవచ్చు. జీడీపీ పెరుగుదలను కొన్ని దేశాలు సంపద సృష్టిగా ప్రచారం చేసుకున్నా.. సగటు జీడీపీ పెరుగుదల పురోగతి కాకుండా తిరోగమనం కూడా కావచ్చు. మరోవైపు విదేశీ ఉత్పత్తులు అమ్ముడుపోయినా అవి జీడీపీ లెక్కల్లోకి రావు. ప్రజల కొనుగోలు శక్తి అధికంగా ఉండి.. విదేశీ ఉత్పత్తులపై అధిక ఖర్చు చేసినా ఆ దేశ జీడీపీ పడిపోయే చాన్స్ ఉంటుంది. దీంతో స్వదేశీ కంపెనీలు నష్టాలబారిన పడి మూతపడే ప్రమాదం సైతం ఉంటుంది. అందుకోసమే ‘జీడీపీని దేని కోసమైతే ఉపయోగించుకోవాలని అనుకున్నామో, ఆ ప్రయోజనం మారిపోయింది. ఆర్థిక శ్రేయస్సు సూచిక కావాలనుకున్నది.. ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాల సూచికగా మారిపోయింది’ అని జీడీపీ కనుగొనడంలో సహాయపడిన న్యూయార్క్ ఆర్థిక వేత్త సైమన్ కుజ్నెట్స్ చెప్పడం గమనార్హం.
వృద్ధి కోసం పలు దేశాల ట్రిక్స్
జీడీపీ వృద్ధిని చూపెట్టడానికి పలు దేశాలు ప్రజలకు ఉపయోగంలోకిరాని, లాభం లేని పనులను చేస్తున్నాయనే విమర్శలు సైతం ఉన్నాయి. ఉదాహరణకు ఒక పది కిలోమీటర్ల రోడ్డును ప్రభుత్వం వేయిస్తే.. దాంట్లో అవినీతి జరిగి, రోడ్డు నాణ్యత లేకపోవడం వల్ల కొన్నాళ్లకు అది పూర్తిగా దెబ్బతింటుంది. దీంతో ప్రభుత్వం మళ్లీ అక్కడ రోడ్డు వేయిస్తుంది. ఇలా పదేళ్లలో మూడు నుంచి నాలుగు సార్లు జరిగితే.. ఒకే రోడ్డు పదేళ్ల పాటు మన్నికగా ఉండడంతో పోల్చుకుంటే మూడు, నాలుగు సార్లు రోడ్డు వేయడం జీడీపీ వృద్ధికి ఉపకరిస్తుంది. మరోవైపు ఒకరు తక్కువ ధరలో నేరుగా ఆన్ లైన్ ద్వారా విమాన టికెట్టును కొంటే జీడీపీకి అంతగా లాభముండదు. అదే వ్యక్తి ఒక ట్రావెల్ ఏజెంట్ ద్వారా టికెట్టును కొంటే, ఓ వైబ్ సైట్ లో రీసెర్చ్ చేసి కొనుగోలు చేస్తే.. అలా మధ్యవర్తులు పెరిగితే.. వ్యయం పెరుగుతుంది. తద్వారా ఇది జీడీపీ వృద్ధికి ఉపకరిస్తుంది. కాని దీని ద్వారా సామాన్య ప్రజలు నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
జీడీపీని ఎలా లెక్కిస్తారు?
ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన సరుకులు, సేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) అంటారు. భారత దేశంలో సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్ఓ) ప్రతి మూడు నెలలకు ఒకసారి జీడీపీని లెక్కించి త్రైమాసిక గణాంకాలను విడుదల చేస్తుంది. అంతేకాకుండా ప్రతి ఏటా వార్షిక జీడీపీ వృద్ధి గణాంకాలను కూడా సీఎస్ఓ విడుదల చేస్తుంది. జీడీపీని ప్రజల వినిమయ వ్యయం, ప్రభుత్వ వ్యయం, పెట్టుబడి వ్యయం, నికర ఎగుమతుల విలువ అనే నాలుగు అంశాల ప్రాతిపదికన లెక్కిస్తారు. వ్యవసాయ రంగం, తయారీ రంగం విద్యుత్, గ్యాస్ పంపిణీ, గనుల తవ్వకం, అడవులు, చేపల వేట, హోటల్, నిర్మాణం, వాణిజ్యం, సమాచార సంబంధాలు, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, బీమా, వాణిజ్య సేవలు, సామాజిక, ప్రజా సేవల తదితర రంగాల గణాంకాలు తీసుకుంటారు.
ఇతర సూచికలపై ఆధారపడాల్సిందే..
దేశ ప్రగతికి జీడీపీని పూర్తి స్థాయిలో కొలమానంగా భావించలేం. అయితే దీన్ని పూర్తిస్థాయిలో కూడా కొట్టిపారేయలేం. ఇది ఉత్పత్తి ద్వారా వస్తున్న సంపదను మాత్రమే లెక్కిస్తుంది. కానీ ఆ సంపద ఎవరికి, ఎందరికి చేరిందనేది మాత్రం చెప్పదు. జీడీపీ లెక్కల ద్వారా సంపద సృష్టి జరిగి అందరూ లాభపడతారని భ్రమ కలిగిస్తారు. దీంతో జీడీపీ దాస్తున్న విషయాలను తెలుసుకోవాలంటే ఇతర సూచికలపై ఆధారపడాల్సిందే. ఆకలి, శాంతి, పర్యావరణ పనితీరు, వాయు కాలుష్యం, లింగ అసమానత, మానవ అభివృద్ధి తదితర సూచికలను పరిగణనలోకి తీసుకుంటేనే ఆ దేశ నిజమైన అభివృద్ధిని లెక్కించవచ్చు. అప్పుడే దేశ ప్రగతిని పూర్తిస్థాయిలో తెలుసుకునే అవకాశం ఉంటుంది.
వృద్ధి రేటులో దూసుకెళ్తున్న భారత్
ప్రపంచ వ్యాప్తంగా బలమైన ఆర్థిక వ్యవస్థల్లో పదేళ్ల క్రితం 11వ స్థానంలో ఉన్న భారత దేశం.. కొంత కాలం క్రితం ఐదో స్థానానికి ఎగబాకింది. ఇప్పుడు శరవేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, చైనాలను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్) ఇటీవల 2024 సంవత్సరానికి సంబంధించి రూపొందించిన ఎకనమిక్ అవుట్ లుక్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2024లో భారత దేశ జీడీపీ 7 శాతంగా ఉండనుండగా, 2025లో ఇది 6.5 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేసింది. మరోవైపు 2027 నాటికి భారతదేశం జర్మనీ, జపాన్‌లను అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అమెరికా ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీతో సహా అనేక ఆర్థిక సంస్థలు అంచనా వేశాయి.
తలసరి ఆదాయంలో మాత్రం వెనకబాటే..
జీడీపీలో బ్రిటన్ ను అధిగమించిన భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినా.. తలసరి ఆదాయంలో మాత్రం చాలా వెనకబడి ఉన్నది. బ్రిటన్ జనాభా దాదాపు 7 కోట్లు కాగా, ప్రస్తుతం భారతదేశ జనాభా దాదాపు 140 కోట్లకు పైమాటే. ఈ లెక్కన చూసుకుంటే సంపద పరంగా భారతదేశం బ్రిటన్ కంటే ఇరవై రెట్లు వెనుకబడి ఉన్నట్టే. బ్రిటన్ తలసరి ఆదాయం 45 వేల డాలర్లకు పైగానే ఉండగా, అదే భారతదేశంలో 2700 డాలర్లు మాత్రమే. దీంతో జీడీపీ ఆధారంగా రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను పోల్చడం సరికాదనే అభిప్రాయం సైతం ఉన్నది. జీడీపీ వృద్ధి రేటులో ఫస్ట్ ప్లేసులో ఉన్న భారతదేశం.. తలసరి ఆదాయంలో మాత్రం 129వ స్థానంలో ఉండడం గమనార్హం.
2024లో టాప్ -10 జీడీపీ దేశాలు
స్థానం దేశం పేరు జీడీపీ (ట్రిలియన్ డాలర్లలో) తలసరి జీడీపీ (డాలర్లలో)
1 అమెరికా 28.78 85,370
2 చైనా 18.53 13,140
3 జర్మనీ 4.59 54,290
4 జపాన్ 4.11 33,140
5 ఇండియా 3.94 2,730
6 బ్రిటన్ 3.5 51,070
7 ఫ్రాన్స్ 3.13 47,360
8 బ్రెజిల్ 2.33 11,350
9 ఇటలీ 2.33 39,580
10 కెనడా 2.24 54,870
తలసరి ఆదాయంలో టాప్ 10 దేశాలు (ఫోర్ట్స్ ఇండియా ఆగస్ట్ – 2024 ప్రకారం)
స్థానం దేశం పేరు తలసరి జీడీపీ (డాలర్లలో)
1 లక్సెంబర్గ్ 1,31,380
2 ఐర్లాండ్ 1,06,060
3 స్విట్జర్లాండ్ 1,05,670
4 నార్వే 94,660
5 సింగపూర్ 88,450
6 యునైటెడ్ స్టేట్స్ 85,370
7 ఐస్లాండ్ 84,590
8 ఖతార్ 81,400
9 మకావో 78,960
10 డెన్మార్క్ 68,900
వృద్ధి రేటులో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నా భారత దేశం.. తలసరి ఆదాయ జాబితాలో మాత్రం 2730 డాలర్లతో 129వ స్థానంలో నిలవడం గమనార్హం.
2024లో జీడీపీ వృద్ధి రేటు అంచనాలు (ఐఎంఎఫ్ ‘ఎకనమిక్ అవుట్ లుక్’ ప్రకారం)
దేశం వృద్ధి రేటు
భారతదేశం 7%
చైనా 5%
ఇండోనేషియా 5%
టర్కీ 3.6%
రష్యా 3.2%
పోలాండ్ 3.1%
అమెరికా 2.6%
సౌత్ కొరియా 2.5%
స్పెయిన్ 2.4%