గాంధీ ఆస్పత్రిలో వైద్యురాలితో రోగి అనుచిత ప్రవర్తన

By Margam

Published on:

Follow Us
గాంధీ ఆస్పత్రిలో వైద్యురాలితో రోగి అనుచిత ప్రవర్తన


Telegram Channel Join Now
డాక్టర్లపై దాడులు, కోల్‌కతా వైద్యురాలిపై అఘాయిత్యం ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతుండగానే.. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. జూనియర్ వైద్యురాలితో ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. ఎమర్జెన్సీ వార్డులో రోగులకు చికిత్స అందించేందుకు వచ్చిన మహిళా సర్జన్‌పై అందరూ చూస్తుండగానే దాడి చేశాడు. వైద్యురాలి అప్రాన్ పట్టుకొని లాగాడు. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది అప్రమత్తమై అతడి బారి నుంచి వైద్యురాలిని రక్షించారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. బుధవారం (సెప్టెంబర్ 11) మధ్యాహ్నం 3.42 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

మహిళా డాక్టర్‌పై దాడికి పాల్పడ్డ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. అతడి వయస్సు 40 ఏళ్లు ఉండవచ్చునని అధికారులు తెలిపారు. నిందితుడు తనతో పాటు ఉన్న ఓ మహిళ చేయి పట్టుకొని నిల్చొని ఉన్నాడు. మరో రోగిని పరిశీలించేందుకు వెళ్తున్న క్రమంలో మహిళా డాక్టర్ అనుకోకుండా అతడి చేతిని తాకినట్లుగా సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. ఇంతలో అతడు వైద్యురాలి దుస్తులు లాగుతూ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో వైద్యురాలి అప్రాన్ చిరిగిపోయింది.

పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని చిలకలగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడిని బన్సీలాల్‌పేటకు చెందిన ప్రకాష్‌గా గుర్తించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు అతడిని తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో అతడు ఇలా చేశాడా? మానసిక స్థితి సరిగా లేదా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని వార్డులోకి ఎలా అనుమతించారని జూనియర్ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. భద్రతా సిబ్బందిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు జూనియర్ డాక్టర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఆస్పత్రుల్లో డాక్టర్లపై భద్రత విషయంలో జూనియర్ డాక్టర్లు గత నెల 10 రోజులు ఆందోళన నిర్వహించారు. వైద్య శాఖ మంత్రి దామోదర నరసింహ హామీతో ఆగస్టు 23న ఆందోళన విరమించారు.

Source link

Leave a Comment