- బుధ,శనివారాల్లో నిర్వహణకు నిర్ణయం
- ఇకపై ప్రతివారం ఇద్దరు మంత్రులు.. నెలకోసారి సీఎం
- ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి విజ్ఞప్తుల స్వీకరణ
- కార్యాచరణ రూపకల్పనకు పీసీసీ కసరత్తు
- హస్తం ‘స్ధానిక’ ఎన్నికల వ్యూహం
- మార్క్ దిశగా పీసీసీ నూతన చీఫ్ నిర్ణయాలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇటీవల పీసీసీ చీఫ్ గా బాద్యతలు స్వీకరించిన మహేశ్ కుమార్ గౌడ్ పార్టీలో తన మార్క్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలో వచ్చిన పార్టీని బలోపేతం చేయడం ద్వారా తన పని తనాన్ని నిరూపించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ, ప్రభుత్వాన్ని జోడెద్దులుగా నడిపేందుకు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీభవన్ కు ఎన్నికల ముందు ఉన్న ఆదరణ తగ్గిందనే అభిప్రాయంతో ఉన్న ఆయన దాని ప్రాముఖ్యత తగ్గకుండా చూడాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు ఈ నెల 15న పీసీసీ అధ్యక్షుడిగా బాద్యతలు స్వీకరించిన మహేశ్ కుమార్ గౌడ్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుతం జ్యోతిరావు పూలే ప్రజాభవన్ మాదిరిగానే గాంధీభవన్ లోనూ ప్రజా సమస్యలు ఆలకించాలని నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం ప్రతి మంగళ, శుక్రవారాల్లో రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న అధికార పార్టీ.. తాజాగా గాంధీభవన్ లోనూ అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా ఇకపై ప్రతి బుధ,శనివారాల్లో ఇద్దరు మంత్రులను మూడు గంటల పాటు అందుబాటులో ఉంచి పార్టీ శ్రేణులు, ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించాలని పీసీసీ భావిస్తున్నది. ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం నెలకోసారి గాంధీభవన్ లో ఉండాలని తద్వారా పార్టీపై కార్యకర్తలు, నాయకులు, ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడుతుందని పీసీసీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇందులో పార్టీ పరంగా, ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నది. ఇందులో ప్రధానంగా క్షేత్రస్థాయిలో జరిగే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యకలాపాలకు చెందిన విజ్ఞప్తులను సీఎం, మంత్రులు దరఖాస్తుల రూపంలో వింటారు. నాయకుల ద్వారా వచ్చే వినతులను రాష్ట్ర పార్టీ యంత్రాంగం ద్వారా సమస్యలను పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకుంటారు. దీనిపై ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్న పీసీసీ పూర్తిస్థాయిలో చర్చించి ప్రజల నుంచి, పార్టీ నాయకులు నుంచి అందే సమస్యలు, ఇతర అంశాలను ఏ విధంగా పరిష్కరించాలి.?అందుకు ఎలాంటి యంత్రాంగం ఉండాలి..? తదితర అంశాలపై పీసీసీ దృష్టిసారించింది. అలాగే పీసీసీ కార్యవర్గంలో కూడా చర్చించి ఓ నిర్ణయం తీసుకొని సమస్యల పరిష్కారానికి మార్గ నిర్దేశికాలను సిద్ధం చేయాలని భావిస్తోంది.
ప్రజావాణి ఎందుకంటే…?
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పార్టీ కార్యకలాపాలలో వేగం తగ్గింది. కొత్తగా ఏర్పాటు అయిన ప్రభుత్వం కావడంతో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు పరిపాలనపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్నారు. రోజువారి సమీక్షలు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేలా విదేశీ పర్యటనలతో సీఎం,మంత్రులు బిజీ బిజీగా గడుపుతున్నారు. దీంతో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలపై ఆశించిన రీతిలో సమయం కేటాయించలేక పోతున్నారన్న భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పార్టీకి చెందిన నాయకులకు, కార్యకర్తలకు కీలక నేతలు అందుబాటులో లేకపోవడం ఆ ప్రభావం పార్టీపై స్పష్టంగా కనబడుతోంది. మరోవైపు స్ధానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడింది. పది నెలల పాలనలో క్షేత్రస్ధాయిలో ప్రభుత్వంపై స్వల్ప అసంతృప్తి రావడం, ప్రతిపక్ష బీఆర్ఎస్ పై సానుభూతి పెరగడం, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బలపడడంతో స్ధానిక సంస్థల ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రాకుండా అధికార పార్టీ వ్యూహాత్మకంగా ముందుకువెళ్లున్నది. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం ద్వారా స్ధానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్ధానాల్లో గెలవాలని స్కెచ్ వేసింది. గాంధీభవన్ లో నిర్వహించే ప్రజావాణి ద్వారా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జనంలోకి తీసుకువెళ్లాలని భావిస్తోన్న అధికార పార్టీ.. ఫిర్యాదుల స్వీకరణకు ఎలాంటి కార్యాచరణ ఉండాలనే అంశంపై విస్తృత చర్చలు జరుపుతున్నది.