Telegram Channel
Join Now
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం .. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలోని పొరుగు సేవల సిబ్బందికి తీపికబురు చెప్పారు. గత ప్రభుత్వం 2023 జూన్ నుంచి 2024 సెప్టెంబరు వరకూ ఉపాధిహామీ పథకం మెటీరియల్ నిధులతో చేపట్టే పనుల కోసం ఇంజినీరింగ్ విభాగంలో వినియోగిస్తున్న సిబ్బందికి జీతాలు బకాయి పెట్టింది. ఈ జీతాలు చెల్లించాలంటూ వీరంతా ఇటీవల విజయవాడలోని పంచాయతీరాజ్ ఈఎన్‌సీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా ఈ జీతాల సమస్యను తీసుకెళ్లారు. వెంటనే ఆయన సమస్య పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు.. పెండింగ్ జీతాల బకాయిలు చెల్లించాలని హైకోర్టు కూడా అధికారులకు సూచించింది. ఈ మేరకు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పరిపాలన నిధుల నుంచి జీతాల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. మొత్తం పెండింగ్ బకాయిల చెల్లింపులకు రూ.24.99 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ దశలవారీగా సిబ్బందికి జీతాల బకాయిల చెల్లింపులకు ఉత్తర్వులు ఇచ్చింది.మచిలీపట్నంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంపై జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. పింగళి వెంకయ్య దేశ స్వాతంత్య్ర పోరాట సమయంలో ప్రజల్లో స్ఫూర్తి నింపేలా ఆయన మువ్వన్నెల జెండాను రూపొందించి జాతికి అందించారన్నారు. మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఆ మహనీయుడి పేరు పెట్టడం ద్వారా ఆయన ఇచ్చిన స్ఫూర్తి భావితరాలకు అందుతుంది అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం చంద్రబాబు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.మరోవైపు చిరుత పులిని దారుణంగా చంపిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. అటవీశాఖ సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు జిల్లా కౌండిన్య అభయారణ్యంలో చిరుత పులులను హతమారుస్తున్న ఘటనలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. చిరుతపులి గోళ్ల కోసం నాలుగు కాళ్లను విరిచేశారని.. అలాగేదంతాలు కూడా తొలగించిన ఘటన దారుణమన్నారు. చిరుతల మరణంపై విచారణ చేసి నేరస్తులను గుర్తించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అన్ని వన్యప్రాణుల వేట ఘటనలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వన్యప్రాణులను వేటాడటం, వాటి అవయవాలతో వ్యాపారాలు చేసేవారిని ఏ మాత్రం ఉపేక్షించవద్దన్నారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు పవన్ కళ్యాణ్. ఈ ఘటనపై చాలా సీరియస్‌గా స్పందించారు.