మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటో క్రిమినల్ కోర్టు ధిక్కరణ పిటిషన్‌గా సీజే ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీజేకు హైకోర్టు న్యాయమూర్తి లేఖ రాశారు. ఎన్‌కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు ఇచ్చిన స్టే పై రఘునందన్ వ్యాఖ్యలు చేశారని న్యాయమూర్తి తెలిపారు.
ఆగస్టు 24న రఘునందన్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని న్యాయమూర్తి వెల్లడించారు. న్యాయవ్యవస్థను రఘునందన్ రావు అగౌరవ పరిచారని న్యాయమూర్తి లేఖలో పేర్కొన్నారు. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల న్యాయస్థానం ప్రతిష్ట మసకబారుతోందని న్యాయమూర్తి లేఖలో వివరించారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌గా ఎందుకు పరిగణనలోకి తీసుకోరాదో వివరణ ఇవ్వాలంటూ రఘునందన్ రావుకు సీజే ధర్మాసనం నోటీసులు జారీచేసింది.